యాదాద్రి: శ్రీలక్ష్శీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదాద్రి ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ ఉన్నందున బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం స్వస్తీవాచనంతో ఉత్సవాలు ప్రారంభమై 14న శతఘటాభిషేకంతో పరిసమాప్తి కానున్నాయి. 10న ఎదుర్కోలు, 11న తిరుకల్యాణ మహోత్సవం, 12న దివ్యవిమాన రథోత్సవం, 13న మహా పూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
యాదాద్రీశుడి క్షేత్రంలో ప్రతిఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలను మొదటగా సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలు అన్న పేరు స్థిరపడింది. ఈ ఉత్సవాలతో స్వామిక్షేత్రం 11 రోజుల పాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. పూర్వం స్వామివారి సన్నిధిలో వేదమంత్ర ఘోషలు వినిపించేవని చెబుతుంటారు. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అని ప్రాచీన నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సకల దేవతలను శాస్ర్తోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్నది.
విశ్వక్సేన పూజలతో మొదలైన ఉత్సవాలు స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో పరిపూర్ణం అవుతాయి. మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు. మూడోరోజు నుంచి స్వామివారి అలంకార సంబరా లు జరుపుతారు. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదోరోజున చక్రతీర్థ స్నానం నిర్వహిస్తారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బ్రహోత్సవాలకు 1955లో శ్రీకారం చుట్టారు. అంతకుమందు భక్తోత్సవాలను నిర్వహించేవారు. అప్పట్లో ఈ ఉత్సవాలు మూడ్రోజులు మాత్రమే జరిగేవి. ఆ తర్వాత ఐదు రోజులకు పెంచారు. గతంలో ఈ ఉత్సవాలు మార్గశిర మాసంలో జరిగేవి. అప్పట్లో కొంత మంది అర్చకులు పాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకు 11 రోజుల పాటు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. ఘాట్‌రోడ్డు లేకపోగా మెట్లదారి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రాయగిరి వరకు వివిధ వాహనాల ద్వారా, అక్కడి నుంచి టాంగాలు, ఎండ్ల బండ్ల సాయంతో చేరుకునేవారు. 1985లో యాదగిరిగుట్ట మండలంగా ఏర్పాటు కావడం, అంతకు ముందు 1978లో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయడంతో ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాలతో పాటు మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. మహారాష్ట్రకు చెందిన భక్తులు వారం రోజులు ఇక్కడే ఉండి స్వామివారి ఉత్సవాలు వీక్షించేవారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వందల కోట్ల వెచ్చించి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దుతుండగా పనులు తుదిదశకు చేరుకున్నాయి. సకల వసతులతో నిర్మిస్తున్న ఆలయంలో వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.