హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పారిశ్రామికవేత్త, శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది. సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవలందించినందుకు 2023వ సంవత్సరానికి వరప్రసాద్‌రెడ్డిని ఎంపిక చేసింది. బాచుపల్లిలోని నూతన క్యాంపస్‌లో సోమవారం జరిగిన వర్సిటీ 39వ వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
గుప్తదానాలు, దాతృత్వంలో ఎల్లప్పుడూ ముందుండే వరప్రసాద్‌రెడ్డి సోమవారం మరోసారి తన మనస్సును చాటుకున్నారు. విశిష్ట పురస్కారం కింద తెలుగు వర్సిటీ ఆయనకు రూ.లక్ష చెక్కు అందించగా, ఆ చెక్కును స్వీకరించిన వరప్రసాద్‌రెడ్డి అదే వేదికపై తెలుగు వర్సిటీకి రూ.కోటి విరాళాన్ని అందజేశారు. వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు తనకు అందించిన లక్షతోపాటు మరో కోటి చెక్కును మంత్రి అందించారు.