హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): గత 30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశం తెలుగు రాష్ట్రాల్లో రగులుతున్నా.. ఎంతోమంది పోరాడుతున్నా పదేండ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం సమస్యను పరిషరించడం లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకపక్ష నిర్లక్ష్యాన్ని ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా నోరు మెదపకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
వర్గీకరణపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరును నిరసిస్తూ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. కండ్లకు గంతలు, నల్ల వస్త్రంకట్టుకొని నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వయంగా ప్రధాని మోదీని కేసీఆర్ కలిసి వర్గీకరణ చేపట్టాలని కోరారని వంగపల్లి శ్రీనివాస్ గుర్తుచేశారు.