ముషీరాబాద్, జూలై 5: ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈనెల 7న గ్రామగ్రామాన దండోరా జెండాను ఎగురవేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 7నాటికి 31 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దండోరా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. మహనీయులు, మాదిగ అమరవీరుల చిత్రపటాలు ఏర్పాటుచేసి.. వారి సేవలను స్మరించుకోవాలని కోరారు.
31 ఏండ్లుగా మాదిగ జాతి అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం జాతి ఉద్యమంలో పాల్గొన్న సీనియర్ నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చి త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కొల్లూరు వెంకట్, వరిగడ్డి చందు, గుమిదేళ్లి తిరుమల్లేశ్, జన్నారపు జీవన్, ఎల్ నాగరాజు, కానుగంటి సురేశ్, శ్యామ్రావు, మణి, ఫణి, తదితరులు పాల్గొన్నారు.