ముషీరాబాద్, జనవరి 10: సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలుచేయాలని వచ్చే నెల 5, 6 తేదీల్లో దీక్ష చేపట్టనున్నట్టు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. కాలాయపన చేయకుండా వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పి కాలాయపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ జిల్లాల్లో తిరిగి వినతి పత్రాలు స్వీకరించిందని చెప్పారు. కాలయాపన చేయకుండా ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లోనే బిల్లు పెడితే సరిపోయేదని చెప్పారు.