భువనగిరి అర్బన్, జనవరి 21 : బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడులకు చిరునామాగా మారాయని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీని వాస్ ఆరోపించారు. శనివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం లో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పి.. ఏడున్నరేండ్లు గడిచినా ఆ హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు. అదీగాక దళితులపై బీజేపీ తరచూ దాడులకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
నూతన విద్యావిధానం తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను రద్దు చేసే కుట్ర పన్నుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్కాలర్షిప్ల రద్దుతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. జైశ్రీరాం అంటేనే రాష్ట్రంలో ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారని చెప్పారు.
దేశంలో అన్ని మతాలు, కులాలవారు సమాన హక్కులతో జీవించాలని అంబేద్కర్ లిఖించిన రాజ్యాంగానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. మనువాదానికి మాదిగవాదమే ప్రతివాదంగా బీజేపీని మాదిగ పల్లెలు, పట్నాల నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయం తేల్చకుండా దళితుల మధ్య చిచ్చు పెడుతున్నదని మండిపడ్డారు. బీజేపీ అంటేనే దళితుల వ్యతిరేక పార్టీ అని తెలిపారు.