BC Resrvations | న్యూఢిల్లీ : తెలంగాణలోని బీసీ రిజర్వేషన్ల పంచాయితీ సుప్రీంకోర్టు గడప తొక్కింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడం చట్ట విరుద్ధమని గోపాల్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఇక ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని చేర్చాడు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో 42 శాతం బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం.. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించడంపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ చేసిన తీర్మానం గవర్నర్ దగ్గరే పెండింగ్లో ఉండగా, ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ లోపు ప్రభుత్వమే జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమిటని కోర్టు ప్రశ్నించింది.
ఎన్నికలకు పది రోజులు ఆగాలని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. దీంతో రిజర్వేషన్ల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కోర్టు విచారణ అనంతరం ఎన్నికలపై ప్రభుత్వం ముందుకెళ్తుందని అంతా భావించారు. కానీ, కోర్టులో కేసు ఉండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడుతల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో 8న కోర్టు ఏం తీర్పు ఇస్తుంది.. మొన్న చేసిన రిజర్వేషన్లు ఉంటాయా.. మారుతాయా.. అన్న ఆందోళన నెలకొన్నది.