హైదరాబాద్: విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను (Vande Bharat Express) సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో తరచూ సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రైలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రద్దవుతుందో తెలియక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రావాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని సీ-9 కోచ్‌లో సాంకేతికత లోపం తలెత్తింది. దీంతో సర్వీసు 4 గంటలు ఆలస్యంగా నడుస్తుందని అధికారులు ప్రకటించారు. ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన రైలు 10 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పారు. రెండు నెలల క్రితం కూడా సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందే భారత్ ఐదు గంటలు ఆలస్యమయింది. మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరాల్సిన రైలు రాత్రి 8 గంటలకు విశాఖకు పయణమయింది.
విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈరైలు మార్గమధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.