హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తేతెలంగాణ):ఎస్సారెస్పీకి మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి పేరు పెట్టడం కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమేనని ఎంసీపీఐ (యూ) రాష్ట్ర నేత వనం సుధాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో బీఎన్ గడ్డపైనే ఆయన చరిత్రను కనుమరుగు చేసే దిశగా రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తున్నదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో వామపక్ష పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాట వీరుల చరిత్రను మరిస్తే ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసిపోతుందని, ఈ విషయం పలు సందర్భాల్లో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.
వీర తెలంగాణ రైతాంగ సాయుధపోరాట యోధుడు, మాజీ ఎంపీ దివంగత భీమిరెడ్డి నరసింహారెడ్డి (బీఎన్ రెడ్డి) చరిత్రను భావితరాలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ రెండో దశకు, సూర్యాపేట జిల్లాకు బీఎన్‌రెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై బీఎన్ విగ్రహం పెట్టాలని, ఆయన పేరుతో 5 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో మల్లు నాగార్జున్‌రెడ్డి, డేవిడ్ కుమార్, నజీర్, దంతాల రాంబాబు, గొడ్డలి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.