హైదరాబాద్, నమస్తే తెలంగాణ (నవంబర్ 17): తిమ్మిని బమ్మిచేసి.. ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి రావాలనే దురాశ తప్ప.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో గుప్పించిన హామీల అమలు ఎలా సాధ్యమన్న ఆలోచన ఆ పార్టీ నేతలకు లోపించిందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేకుండా ఉచితాలను, పథకాలను ప్రకటించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీల అమ లుకు రూ.3.50 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లు మాత్రమే. మరి కాంగ్రెస్ హామీలు అమలు చేయాలంటే అదనంగా మరో రూ.80వేల కోట్లు కావాలి. వీటికి అదనంగా ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ ఖ ర్చులు తదితర వాటిని లెక్కిస్తే మొత్తంగా మ రో రూ.2 లక్షల కోట్ల వరకు అప్పులు చేయా ల్సి ఉంటుందని చెప్తున్నారు. చాంతాడంత జాబితా చూస్తుంటే ఇది అమలయ్యే పని కాదని అర్థం అవుతుదన్నదని అంటున్నారు.
➢ పెన్షన్ల పెంపునకు రూ.39 వేల కోట్లు
➢ ఇండ్ల నిర్మాణం పథకానికి 55 వేల కోట్లు
➢ దళితబంధు, 3కార్పొరేషన్లకు 45 వేల కోట్లు
➢ ఎస్టీలకు కేటాయింపులకు 28 వేల కోట్లు
➢ రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులు, కూలీలకు రూ.69 వేల కోట్లు
➢ మహిళా సంక్షేమానికి రూ.39 వేల కోట్లు
➢ తండాలకు ప్రత్యేక నిధులు 1,250 కోట్లు
➢ ఉద్యోగ కల్పన, జీతాలకు 6 వేల కోట్లు
➢ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు రూ.7,500 కోట్లు
➢ అమరులకు పెన్షన్‌కు రూ.36 కోట్లు
➢ విద్యార్థులకు సాయం రూ.2 వేల కోట్లు
➢ ఎలక్ట్రిక్ స్కూటర్లకు రూ.20 వేల కోట్లు
➢ ఇమాంలు, మౌజంలు, పాస్టర్ల గౌరవవేతనాలకు రూ.550 కోట్లు
➢ బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్లు,
➢ రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.1000 కోట్లు
➢ మధ్యాహ్న భోజన కార్మికుల వేతనానికి రూ.650 కోట్లు
➢ రేషన్ డీలర్ల వేతనానికి రూ.100 కోట్లు
➢ ఉపాధి కూలీల వేతనాలు, పనిరోజుల పెంపుతో రూ.2 వేల కోట్లు
➢ ఆటో డ్రైవర్లకు రూ.720 కోట్లు,
➢ అంగన్వాడీ టీచర్లకు రూ.750 కోట్లు
➢ ఇతర హామీల అమలుకు 10 వేల కోట్లు