హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లోని 859, 860 సర్వే నంబర్లలోని విలువైన 4 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయరాదని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో హాస్టళ్లు, పాఠశాల భవనాలు, ఆట స్థలాలు, ఇతర సౌకర్యాల ఏర్పాటు కోసం ఆ భూమిని వినియోగించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, మోతూర్ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించింది. ఆ భూమి ఆక్రమణకు గురికాకుండా నిరోధించేందుకు కంచె నిర్మించాలని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. మినీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం కోసం ఏ రవికుమార్, మరొకరు 6 ఎకరాలను విరాళంగా ఇచ్చారు. అందులోని 2 ఎకరాల్లో కస్తూర్బా పాఠశాల భవనాన్ని నిర్మించారు. మిగిలిన నాలుగు ఎకరాలను తమకు అప్పగించాలని వారు దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. దీనితోపాటు ఇదే అంశంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ జరిపి, సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది.