హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సహకరించాలని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు శనివారం లేఖలు రాశారు.
తెలంగాణ బీసీ కమిషన్ వివిధ అధ్యయనాల్లో భాగంగా కోరే సమాచారాన్ని వెంటనే అందించి, సహకరించేలా ఆయా ప్రభుత్వ విభాగాలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించేందుకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు.
కమిషన్‌కు వివరాలు ఎంత త్వరగా అందిస్తే అంత త్వరగా నివేదికలను అందజేయడానికి వీలుంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులు, బీసీ కమిషన్‌తో సీఎం రెండుసార్లు సమావేశం నిర్వహించారని గుర్తుచేశారు.