హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఏకరీతి రవాణా సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ‘వాహన్ సారథి’ వెబ్సైట్ నిత్యం మొరాయిస్తున్నది. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆన్లైన్ ద్వారా ఏకీకృత విధానాన్ని సమర్థంగా అమలు చేయడంలో సిబ్బందికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా గంటల తరబడి పోర్టల్ పనిచేయకపోవడంతో ఆర్టీఏ సేవల కోసం కార్యాలయాలకు వచ్చిన వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. జంటనగరాల్లో ఉదయం నుంచే క్యూలో వేచి ఉన్నా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వెనుదిరగాల్సివచ్చిందని వాపోయారు.
వాహన్సారథి సర్వర్లు మొరాయిస్తుండటంతో జిల్లాలతోపాటు జంటనగరాల్లోని రవాణా శాఖ కార్యాలయాల్లో చిన్న పనులు కూడా పూర్తికాలేదు. దీంతో క్యూలైన్లో ఉన్న వాహనదారులను చూసి అధికారులు తలలు పట్టుకున్నారు. సాంకేతిక సమస్యలపై దృష్టిపెట్టిన ఉన్నతాధికారులు మొత్తానికి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమస్యను పరిష్కరించారు. సెంట్రల్ సర్వర్లకు డాటా లోడింగ్‌లో వచ్చే ఇబ్బందులతోనే రవాణా సేవలకు అంతరాయం కలుగుతున్నదని వినియోగదారులు మండిపడుతున్నారు.
వాహన్ సారథి పోర్టల్‌లో ఢిల్లీలోనే సాంకేతిక సమస్య తలెత్తిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. తెలంగాణ రవాణా శాఖ కార్యాలయాల నుంచి ఎలాంటి సమస్య లేదని చెప్పారు. వెబ్సైట్ సర్వర్‌డౌన్ కావడానికి ఢిల్లీ కేంద్ర కార్యాలయంలోనే సాంకేతిక సమస్యనే కారణమని అన్నారు. ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.