హనుమకొండ, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తేమ… పంట సాగుకు కీలకం. పండిన పంట నుంచి విడదీయలేని ప్రక్రియ. ప్రతికూల వాతావరణంలో పంట వెంటే తేమ. ఈ తేమ ఇప్పుడు చిన్న విషయం కాదు. తేమ పేరు చెబితేనే వరి రైతు ఆగమవుతున్నాడు. తేమ పేరుతో కండ్ల ముందు జరిగే దోపిడీ తలుచుకొని గుండెలు బాదుకుంటున్నాడు. తేమ పేరుతో ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో జరిగే దోపిడీ లెక్కలు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. బస్తాకు మూడు కిలోలే, క్వింటాకు ఆరు కిలోలే అంటే రాష్ట్రం మొత్తం చూస్తే ఈ తేమ దోపిడీ రూ.వెయ్యి కోట్లను దాటున్నది. ప్రతి సీజన్లో తేమ పేరుతో రైతులను రూ.వెయ్యి కోట్ల వరకు దోపిడీ చేస్తున్నారు. నిబంధనల సాకుతో అధికారుల సహకారంతో మిల్లర్లు సాగిస్తున్న ఈ దందాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. కనీసంగా అయినా చర్యలు చేపట్టకుండా దోపిడీ సాగించేలా చేస్తున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కలిసి రైతులను నిండా ముంచుతున్నారు. కేంద్రాలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ తతంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
ప్రశ్నిస్తే అంతే మరి..
వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి 40 కిలోల చొప్పున బస్తా కాంటా పెట్టాల్సి ఉన్నా తేమసాకుతో రెండు మూడు కిలోలు ఎక్కువ జోకి రికార్డుల్లో మాత్రం నలభై గానే చూపుతున్నారు. ఇలా క్వింటాలుకు కనీసంగా 6 కిలోలు అదనంగా రైతుకు నష్టం కలిగిస్తున్నారు. తేమ, తరుగు ఏంటని రైతు ప్రశ్నిస్తే కాంటా జరగదు., సరుకు తరలదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి గత్యంతరం లేని స్థితిలో రైతులు వారిచెప్పిన దానికే తలూపాల్సిన దుస్థితి దాపురిస్తున్నది.
చూస్తే చిన్నదే.. లెక్కపెద్దది..
క్వింటాకు ఆరు కిలోల తేమ దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణంగా మారింది. కానీ లెక్కల్లో చూస్తే వానకాలంలో రాష్ట్రంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కోటీ 48 లక్షల టన్నుల వడ్లు ఉత్పత్తి అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వ పరంగా నిర్వహించే కొనుగోలు కేంద్రాలకు 80 లక్షల టన్నుల వరకు వస్తాయని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు, అధికారులు కలిసి క్వింటాకు సగటున ఆరు కిలోల చొప్పున దోపిడీ చేస్తున్నారు. వానకాలం వడ్లకు కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2,389 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరు కిలోలకు రూ.143.34 ధరగా ఉండగా, టన్నుకు రూ.1433.40 దోపిడీ జరుగుతున్నది. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్న 80 లక్షల టన్నులకు దోపిడీ లెక్క పెడితే ఏకంగా రూ.1146.72 కోట్లుగా ఉంటుంది. ఇంత జరుగుతున్నా సర్కార్ పెద్దలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
దోపిడీ ఇలా…
నాటు వేసిన నుంచి కోతల వరకు అధిక వానలు, వరదలతో ఈసారి వరి పంట దెబ్బతిన్నది. సగటున ఎకరానికి 4 క్వింటాళ్ల వరకు పంట తగ్గింది. భూమి పదును ఉండడంతో బురదలో నడిచే మిషన్లతో కోతలు చేయడంతో సాధారణ మిషన్తో పోల్చితే రైతులపై అదనంగా రూ.10 వేల భారం పడింది. వడ్లను ఆరబెట్టడం, కొనుగోలు కేంద్రాలకు తరలించడం కోసం మరింత ఖర్చు అయింది. తరలించిన వడ్లు కాంటా కావాలంటే క్వింటాకు ఆరు కిలోలు భరిస్తే వెంటనే జరుగుతాయి, లేదంటే వారాల తరబడి ఆగాల్సిందే.
తరుగు తీస్తున్నరు
వడ్ల కేంద్రంలో కాంటాలు దబ్బున అయితలేవు. 25 ఎకరాల్లో వరి వేసిన. వడ్లు తెచ్చి పరకాల వ్యవసాయ మార్కెట్ల ఆరబోసిన. వారంలోనే వడ్లు ఆరినయి. 20 రోజుల తర్వాత వడ్లను కాంటా పెట్టిండ్లు. 40 కిలోల బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీస్తున్నరు. 1065 బస్తాల వడ్లు పండితే 22.59 క్వింటాళ్ల తరుగుపోతున్నది.
-దగ్గు విద్యాసాగర్ రావు, పరకాల, హనుమకొండ జిల్లా