హైదరాబాద్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ): తెలంగాణలో కల్తీ, నాసిరకం మద్యం విక్రయాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండడమే ఇందుకు కారణమని స్పష్టంచేశారు.
గురువారం సెంట్రల్ ఎైక్సెజ్ సవరణ బిల్లు-2025పై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, సామాజిక కోణంలోనే గాక ఆర్థికంగా కీలకమైన ఈ బిల్లుకు బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం రవిచంద్ర మాట్లాడు తూ.. తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లో అధిక పన్నుల కారణంగా మద్యం బ్లాక్ మార్కెట్ పెరిగిపోతున్నదని, ప్రజారోగ్యం, ఆదాయంతోపాటు సామాజిక బాధ్యతను గుర్తుపెట్టుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎైక్సెజ్ ఆదాయంపై అధికంగా ఆధారపడే రాష్ట్రాలకు ఆర్థిక రక్షణ కల్పించాలని వద్దిరాజు విన్నవించారు.
రాష్ట్రంలో రోడ్ల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణానికి నిధులివ్వాలని కేంద్ర ఉ పరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని వద్దిరాజు రవిచంద్ర కోరారు. గురువారం సాయంత్రం పార్లమెంట్ ప్రాంగణంలోని మంత్రి చాంబర్లో కలిసి వినతిపత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించినట్టు వద్దిరాజు తెలిపారు.