హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): భారతీయుల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన వందేమాతర గీతం స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక భూమిక పోషించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిదాయక గీతం రచించి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం రాజ్యసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. బంకించంద్ర ఛటర్జీ 1875లో రచించిన ఆనంద్మఠ్ పుస్తకంలోని ఈ గీతం వలస పాలకులపై పోరాడేందుకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని గుర్తుచేశారు. స్వాతంత్య్ర పోరులో భాగంగా తెలంగాణ ప్రాంతంలోనూ నిజాం నవాబ్కు వ్యతిరేకంగా 1938లో వందేమాతర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తుచేశారు.
ఈ ఉద్యమంలో పాల్గొన్న 1,550 మంది విద్యార్థులను విద్యాసంస్థల నుంచి బహిష్కరించారని, ఇందులో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఉన్నారని చెప్పారు. ఆ విద్యార్థులను ఏ కళాశాలలోనూ చేర్చుకోవద్దంటూ అప్ప టి నైజాం సర్కారు హుకుం జారీ చేసిందని, కా నీ నాగ్పూర్ యూనివర్సిటీ.. పీవీకి చదువుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. వందేమాతర ఉద్యమ స్ఫూర్తితో నిజాం నిరంకుశ పాలనపై సర్వాయి పాపన్నగౌడ్, కుమ్రం భీం, దొడ్డి కొమురయ్య వంటి అనేకమంది యోధులు వీరోచితంగా పోరాడారని స్మరించుకున్నారు.