హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పదేండ్ల పాలనలో వైద్య, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఎంతో గొప్పగా ఎదిగిన తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీ డర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఐటీ, ఫార్మాలో ప్రపంచంలోనే హైదరాబాద్ సుస్థిరస్థానం పొందిందని వ్యాఖ్యానించారు. ఐఐఎం సవరణ బిల్లు-2025ను బుధవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో వద్దిరాజు మాట్లాడుతూ.. అసోంలోని గౌహతిలో రూ.550 కోట్లతో ఐఐఎం నెలకొల్పానే బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ పాలనలో తెలంగాణలోని 33జిల్లాల్లో మెడికల్, నర్సింగ్, పెద్దసంఖ్యలో గురుకుల కాలేజీలు ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు.
నాటి ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ ముందుచూపు నిర్ణయాలతో ఐటీ పరిశ్రమలకు హబ్‌గా మారిందని చెప్పారు. 2023-24లో రూ. 2.70లక్షల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేయడమే ఇందుకు నిదర్శనమని ప్రస్తావించారు. ఈ రంగంలో 10 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నట్టు చెప్పారు. ఫార్మా ఉత్పత్తులకు హైదరాబాద్ కేంద్రంగా, వ్యాక్సిన్ రాజధానిగా పేరుగాంచిందని గుర్తుచేశారు. ఇక్కడ ఏటా 11 బిలియన్ డోసుల వ్యాక్సిన్లు (దేశ ఉత్పత్తిలో 65శాతం) తయారవుతున్నాయని, 140 దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు. 2023-24 రాష్ట్ర జీఎస్డీపీ రూ.15.20 లక్షల కోట్లని, వృద్ధిరేటు 7.4 శాతమని ఇదీ జాతీయ సగటు కంటే ఎల్లప్పుడూ ఎక్కువేనని స్పష్టంచేశారు. హైదరాబాద్ సమీపంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నదని, ఇన్ని అనుకూలతలు ఉన్నందున ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని వద్దిరాజు చెప్పారు.