హైదరాబాద్ జూలై 17 (నమస్తేతెలంగాణ): బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడికి దిగడం దుర్మార్గమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహా బీఆర్ఎస్ నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రశ్నించడాన్ని ఓర్వలేకే ప్రభుత్వం దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు.
ప్రశాంత్‌రెడ్డి నివాసంపై దాడిని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఖండించారు. హామీలు అమలు చేయాలని నిలదీస్తే అక్కసుతో దౌర్జన్యాలకు దిగడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ హింసకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. దాడులతో బీఆర్ఎస్ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయలేరని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ గుండాల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దాడిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలను వదిలి బీఆర్ఎస్ నేతలపైనే కేసులు నమోదు చేయడం అక్రమమని బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ ఆక్షేపించారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ జూలై 17 (నమస్తేతెలంగాణ): ప్రజాసమస్యలపై నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణుల దాడి అప్రజాస్వామికమని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి దాడులతో ప్రశ్నించే గొంతులను నొక్కలేరని తెలిపారు. పోలీసులు దాడిచేసిన వారిని వదిలి, బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం అక్రమమని పేర్కొన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలతో ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటాన్ని ఆపలేరని తేల్చిచెప్పారు. వెంటనే పోలీసుల అదుపులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.