కవాడిగూడ, నవంబర్ 16: ‘42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసగిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా తొందరపడి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ‘రన్ ఫర్ సోషల్ జస్టిస్’ పేరుతో రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్థానిక ఎన్నికలు ఆగిపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదన్న సాకు చూపుతున్న ప్రభుత్వం.. లక్ష కోట్ల బడ్జెట్లో రూ.3,000 కోట్లు ఆగిపోతే వచ్చే నష్టమేమిటని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం మూడు వేల కోట్లు భరించలేదా? అని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే బీఆర్ఎస్ కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం స్థానిక ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే సాకుతో బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు తగిన బుద్ధి చెప్పి తీరుతారని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకోసం బీసీ జేఏసీ చేస్తున్న పోరాటంలో కలసి నడుస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చేంత వరకూ బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
క్యాబినెట్ భేటీలో అఖిలపక్షంపై తేల్చాలి
సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో చర్చించాలని, సోమవారం జరిగే క్యాబినెట్ భేటీలోనే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లే తేదీని ప్రకటించాలని జాజుల డిమాండ్ చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని కోరారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇండియా కూటమి నాయకులతో పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని డిమాండ్ చేశారు.
పార్టీపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఒప్పుకునేది లేదని, చట్టపరమైన రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని స్పష్టంచేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరిని విడనాడాలని కోరారు. పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేకుంటే వేలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి పార్లమెంట్‌ను ముట్లడిస్తామని జాజుల హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, కో ఆర్డినేటర్ కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశాచారి, బీసీ సంఘాల నేతలు శ్యామ్, విక్రమ్‌గౌడ్, డాక్టర్ పురుషోత్తం, వేముల రామకృష్ణ, శ్రీధర్, శేఖర్‌సాగర్, వీరాస్వామి పాల్గొన్నారు.