V. Prakash | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ దుఃఖంలోంచి పుట్టిందే కాళేశ్వరం ప్రాజెక్టని, తుమ్మిడిహెట్టి కోణం నుంచి చూస్తే అది ఎవరికీ అర్థం కాదని తెలంగాణ రాష్ట్ర జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ వెల్లడించారు. ప్రాజెకు విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్‌ను శనివారం ఆయన ప్రత్యేకంగా కలిసి కాళేశ్వరంపై జరుగుతున్న ప్రచారం, వాస్తవాలు, ప్రాజెక్టు రీ డిజైన్ ఆవశ్యకత, ప్రయోజనాలను వివరించారు. అనంతరం బీఆర్కే భవన్లో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ భవిషత్తు కోసమే కేసీఆర్ అన్ని ప్రాజెక్టులను డిజైన్ చేశారని వివరించారు. వాస్తవంగా అక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా అందులో ఎగువ రాష్ర్టాలు వినియోగించుకోని 63టీఎంసీలు ఉన్నాయని, ఆ జలాలను మినహాయిస్తే అక్కడ నికర నీటి లభ్యత 102 టీఎంసీలేనని వివరించారు.
బరాజ్ ఎత్తును 152ఎఫ్ఆర్ఎల్ వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర సర్కారు ఒప్పుకోలేదని, 148ఎఫ్ఆర్ఎల్కే సుముఖత వ్యక్తం చేసిందని, ఆ ఎత్తులో బరాజ్ నిర్మిస్తే తెలంగాణ వినియోగించుకోగలిగేది 54టీఎంసీలకు మించవని తెలిపారు. ప్రాజెక్టు ప్రాంతంలో చాప్రాల్ అభయారణ్యం కూడా ఉన్నదని, అనుమతుల సాధన కష్టమని, ఈ సవాళ్లన్నింటి నేపథ్యంలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ రీ డిజైన్ చేసి మేడిగడ్డకు మార్చారని గుర్తుచేశారు.
హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు కృష్ణా, గోదావరి బేసిన్లో 9 భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన జరిగితే ఆంధ్రలో విలీనం తర్వాత 7 ప్రాజెక్టులు అటకెక్కాయని తెలిపారు. కృష్ణా, గోదావరిపై కర్ణాటక, మహారాష్ట్ర దాదాపు 300కు పైగా చెక్‌డ్యామ్‌లు, ఇతర ప్రాజెక్టులు కట్టాయని, దీంతో దిగువకు జలాలు రావడం తగ్గిపోయిందని, నీటి కొరతతో కరువు ఏర్పడి తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. ఒక్క గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల ఆయకట్టుకే 400 టీఎంసీలకు పైగా కావాలని నొక్కిచెప్పారు.
ప్రాణహిత ప్రాజెక్టు లక్ష్యం కేవలం 16లక్షల ఎకరాల ఆయకట్టేనని, కాళేశ్వరం కింద కొత్త, స్థిరీకరణ కలిపి 38లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉన్నదని గుర్తుచేశారు. స్వల్పకాలంలోనే 17లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని వెల్లడించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది తప్ప అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. విద్యుత్తు చార్జీలపై చేస్తున్న ప్రచారం కూడా అబద్ధమని, అసంబద్ధమని తెలిపారు. ప్రాజెక్టు ప్రతి అంశాన్ని నోట్ రూపంలో కమిషన్‌కు అందించానని, కమిషన్ సూచనమేరకు వాటన్నింటికీ సాక్ష్యాలతో సహా 26న అఫిడవిట్‌ను దాఖలు చేస్తానని చెప్పారు.
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ శనివారం నుంచి పునఃప్రారంభమైంది. విశ్రాంత ఇంజినీర్లతో పాటు, పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలు వెల్లడించారు. తాజాగా వీ ప్రకాశ్ ప్రాజెక్టు రీ డిజైన్, ప్రయోజనాలను వివరించారు. ప్రాజెక్టు ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు, ప్రైవేట్ వ్యక్తుల అభిప్రాయాలన్నింటినీ అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని సూచించిన మేరకు మొత్తం 57మంది అఫిడవిట్లు దాఖలయ్యాయి. రెండు వారాల్లో అఫిడవిట్లపై విచారణ ప్రక్రియ ప్రారంభించే దిశగా కమిషన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.