తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటిలభ్యత లేకపోవడం, పర్యావరణ అనుమతులు అంత సులువుకాకపోవడం వల్లే తెలంగాణ సర్కారు ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరాన్ని నిర్మించింది.
– వీ ప్రకాశ్
Kaleshwaram | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఉమ్మడిపాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, మరోవైపు తెలంగాణ రైతాంగం డిమాండ్లు, సాంకేతిక సమస్యల నేపథ్యంలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టాల్సి వచ్చిందని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, నీటిరంగ నిపుణుడు వీ ప్రకాశ్ ఉద్ఘాటించారు. ప్రాజెక్టును తప్పక పునరుద్ధరించాల్సిందేనని, ఆ అవకాశమూ ఉన్నదని ఘంటాపథంగా తెలిపారు. ఈ మేరకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఎదుట నివేదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్కే భవన్లో బుధవారం జరిగిన విచారణకు వీ ప్రకాశ్ హాజరయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసిన వీ ప్రకాశ్‌ను జస్టిస్ ఘోష్ విచారించారు. ప్రాజెక్టును రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మేడిగడ్డకు ఎందుకు మార్చారు? తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా వీ ప్రకాశ్ మాట్లాడుతూ..
మేడిగడ్డ వద్ద నిర్మాణం వెనుక అనేక కారణాలు
అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులను చేపట్టకుండా ఉమ్మడిరాష్ట్రం పక్కన పెట్టిందని ప్రకాశ్ వివరించారు. మరోవైపు ఎగువన మహారాష్ట్ర, ఇంకోవైపు కర్ణాటక తదితర రాష్ర్టాలు గోదావరిపై అనేక ప్రాజెక్టులను, బరాజ్‌లను నిర్మించి జలాలను మళ్లించుకుంటున్నాయని తెలిపారు. దీంతో తెలంగాణకు సంబంధించి ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్, కడెం, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల ఆయకట్టుకు సరిపడా నీరందని దుస్థితి నెలకొన్నదని వివరించారు. సాగునీరందక తెలంగాణ రైతాంగం అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, దీంతో పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవంగా తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించాల్సి ఉందని అన్నారు. అయితే అప్పటికే గోదావరిలో తెలంగాణ నీటి అవసరాలు 200 టీఎంసీలకు పైగా డిమాండ్ ఉందని గుర్తుచేశారు. అయితే తుమ్మిడిహెట్టి వద్ద కేవలం 165 టీఎంసీలు అందుబాటులో ఉండగా, అందులో ఎగువ రాష్ర్టాల వాటా 63 టీఎంసీలు పోగా మిగిలింది 102 టీఎంసీలని తెలిపారు.
అక్కడ బరాజ్ నిర్మించినా 44 టీఎంసీలకు మించి వినియోగించుకోలేమని వెల్లడించారు. ఇదే విషయాన్ని చెప్తూ వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలని తెలంగాణకు సీడబ్ల్యూసీ సూచించిందని గుర్తుచేశారు. అదీగాక తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి సాంకేతికంగా అనేక సమస్యలున్నాయని, పక్కన చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉందని, అనుమతులు రావడం అసాధ్యమని తెలిపారు. ఇంకా ముంపు తదితర అనేక సమస్యల నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు ప్రాజెక్టును రీడిజైన్ చేసిందని వివరించారు. హరీశ్‌రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావుతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం 2016లో చేసిన సిఫారసుల ఆధారంగానే నీటిలభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించి 18.25 లక్షల కొత్త ఆయకట్టుకు, వివిధ ప్రాజెక్టుల కింద నీరందని 18.75 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నీరందించాలని నిర్ణయించిందని తెలిపారు. అదేవిధంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన బరాజ్‌ను కూడా వార్ధా పైకి మార్చిందని చెప్పారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 56 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందించాలని ప్రణాళిక సిద్ధం చేయగా, వార్ధాపై బరాజ్ నిర్మించడం ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీరందించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందని వివరించారు. గోదావరిలో తెలంగాణ నీటివాటా 968 టీఎంసీలని, ఆ మేరకు జలాలను వినియోగించుకోవాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప మరో మార్గం లేదని వీ ప్రకాశ్ నొక్కిచెప్పారు. మేడిగడ్డ వద్ద బరాజ్‌ల నిర్మాణాన్ని విశ్రాంత ఇంజినీర్ల కమిటీ వ్యతిరేకించలేదని, పలుసార్లు సమర్థించారని గుర్తుచేశారు. బొగ్గుగనుల ప్రాంతంలో సొరంగాలు నిర్మించవద్దన్న విశ్రాంత ఇంజినీర్ల సిఫారసులను బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించాల్సిందేనని, అందుకు అనేక అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. అటు తరువాత కమిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. గురువారం పలు నిర్మాణ సంస్థల బాధ్యులను విచారించనున్నట్టు సమాచారం.
కాళేశ్వరంపై కావాలనే దుష్ప్రచారం..
కమిషన్ విచారణ అనంతరం వీ ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. కమిషన్ ఎదుట నివేదించిన వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, కమిషన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర జలశక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, ఎమ్మెల్సీ కోదండరాం, ఎలక్ట్రిసిటీ ఇంజినీర్ రఘు పేర్లను ఉదహరించారు. నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ వెల్లడించినా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరెంటు ఖర్చులపై కూడా దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోనూ లిఫ్ట్‌లు ఉన్నాయని తెలిపారు. విశ్రాంత ఇంజినీర్ల రిపోర్టును కూడా కాంగ్రెస్‌తోపాటు, ఆ ముగ్గురు పెద్దమనుషులు పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. మూడో టీఎంసీ ఎందుకనేది నీళ్లపై అవగాహన ఉన్నవాళ్లకే అర్థమవుతుందని వీ ప్రకాశ్ తెలిపారు. తెలంగాణ వాటా జలాలు 968 టీఎంసీలను వినియోగించుకోవాల్సి ఉంటుందని, లేదంటే జలహక్కులను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. తుదకు విచారణ కమిషన్‌కు సైతం గతంలోని అబద్ధపు ప్రచారాలనే నివేదించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కమిషన్ ఎదుటకు వచ్చి వాస్తవాలను వివరించానని తెలిపారు.