హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ) : ‘సీఎం సాబ్.. జర గా ఆడోళ్లకు ఇత్తమన్న రూ.2500 మహాలక్ష్మి పథకం (Mahalakshmi) పైసలు ఇయ్యరాదు.. పండగకు బోనాలు చూద్దామని నేను పోతే, బోనం ఎత్తున్న మహిళలు నా దగ్గరికి వచ్చి మాకిచ్చిన హామీ ఏమైంది అని అడుగుతున్నరు’ అని కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీ గురించి ఆ పార్టీ నేత వీ హనుమంతరావు (V.Hanumanth Rao) తనదైన ైస్టెల్లో సీఎం రేవంత్‌రెడ్డిని అడిగారు. ఆదివారం చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సభ నిర్వహించారు. వేదిక సీఎం సహా మంత్రులు ఉన్నారు.
ఈ సందర్భంగా మైక్ అందుకున్న వీహెచ్.. మహాలక్ష్మి పథకం గురించి ప్రస్తావించారు. ‘మనం ఇచ్చిన హామీలన్నీ అమలైతున్నయ్. కానీ మహిళకు రూ.2500 మాత్రమే అమలు కాలేదంటూనే.. సీఎం సాబ్.. జరగా.. ఒక పథకం అమలు చేస్తే మనం అన్ని ఇచ్చినట్టే. నిజం చెప్తున్నా.. మహిళలంతా ఈ పథకం గురించే అడుగుతున్నరు’ అని సీఎం వైపు చూస్తూ అనడంతో రేవంత్‌రెడ్డి ముఖం చిన్నబోయింది. వీహెచ్ మాటలు వేదిక కింద జనాల్లో నవ్వులు పూయించాయి.