హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గొల్లకురుమల అభ్యున్నతి కోసం ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి వల్లే మొదటి విడతలో 3,60,098 మందికి గొర్రె లు పంపిణీ చేశామని, రెండో విడతలో 3,57,971 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. గొర్రెల పంపిణీ పథకంపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ఉత్తరాఖండ్ పశుసంవర్ధక శాఖ అధికారుల బృందం మంగళవారం బాలరాజు యాదవ్‌తో భేటీ అయ్యింది.
ఈ సందర్భంగా పథకం తీరుతెన్నులు తెలుసుకొన్నది. బాలరాజు మాట్లాడుతూ గొర్రెల పంపిణీతోపాటు ఉచిత ఇన్సూరెన్స్, వ్యాక్సినేషన్ కల్పిస్తున్నామని తెలిపారు. 1962 టోల్‌ఫ్రీ నంబర్‌తోపాటు 100 సంచార పశు వైద్యశాలలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. పథకం అమలు వల్ల రాష్ట్రంలో గొర్రెల ఉత్పత్తి పెరిగిందని, ఇతర రాష్ర్టాల నుంచి మాంసం దిగుమతి భారీగా తగ్గిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ స్కీంపై ఉత్తరాఖండ్ అధికారుల బృం దం ప్రశంసలు కురిపించింది. ఈ స్కీం అద్భుతంగా ఉన్నదని, ఒక సామాజికవర్గం అభివృద్ధి కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేయడం ఆశ్చర్యంగా ఉన్నదని చెప్పింది. తమ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపి ణీ పథకం అమలు చేయాలని భావిస్తున్నట్టు ఉత్తరాఖండ్ పశుసంవర్ధక శాఖ జేడీ ఆర్ఎస్ నిత్వాల్ తెలిపారు.