Uttam Kumar Reddy | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా సీనియర్ మంత్రులు ఏదైనా విషయంపై మీడియాతో మాట్లాడే ముందు కాస్త అవగాహన పెంచుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకోవాలి. పోనీ ఆయన వ్యక్తిగత సిబ్బంది అయినా మంత్రి అడిగిందే తడవుగా క్షణాల్లో డాక్యుమెంట్లను చేతికి అందించే పరిస్థితి ఉండాలి. కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నం. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా ఆయన తీరు మారడం లేదు.
గతంలో ఓసారి అసెంబ్లీ వేదికగా జరుగుతున్న చర్చల్లో తాను ప్రిపేర్ అయి రాలేదంటూ అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి హోదాలోనూ ఆయనకు తిప్పలు తప్పడం లేదు. సోమవారం అసెంబ్లీలో ఆయన నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. సొంతంగా అవగాహన లేక, పీఏలు, ఇంజినీర్లు, ఇతర సిబ్బంది సహకరించక నానా అవస్థలు పడ్డారు. పాలమూరు అనుమతుల కుదింపు వ్యవహారంలో అడ్డంగా బుక్కయిన ఆయన, బీఆర్ఎస్ను ఇరికించబోయి అడ్డంగా దొరికిపోయారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన పాత జీవోలు, కేంద్రం రాసిన లేఖల కాపీల కోసం పీఏ, పీఆ ర్వో, ఇంజినీర్లు.. ఇలా ఎవరిని అడిగినా ఒక్క కాగితం చేతికి అందివ్వలేదు. ఫోన్లు చేసి బతిమిలాడినా ఫలితం కనిపించలేదు. చివరకు ఇదే నెలలో స్వయానా ఆయన కేంద్ర జల్‌శక్తి కార్యదర్శికి రాసిన లేఖ ప్రతి సైతం ఇచ్చేవారే కరువయ్యారు. ఆయన పరిస్థితిని చూస్తే ఎవరికైనా ‘పాపం.. ఉత్తమ్’ అని అనిపించక మానదు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90 టీఎంసీల సామర్థ్యాన్ని 45 టీఎంసీలకు కుదించి కేంద్రాన్ని అనుమతులు కోరిన వైనాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి తీసుకొచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సర్కారు పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా మారిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ గుట్టు బయటపడినప్పటి నుంచి చారిత్రక అన్యాయాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన చాంబర్లోకి వెళ్లారు. హడావుడిగా మీడియా ప్రతినిధులను చిట్‌చాట్‌కు పిలిచారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వాస్తవ సామర్థ్యం 90 టీఎంసీలు అయినా తాను 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్టు మంత్రి అంగీకరించారు. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చిందని, ఆ మేరకే తాను లేఖ రాసినట్టు బీఆర్ఎస్పై ఆ నెపాన్ని నెట్టేందుకు ప్రయత్నించారు. మరి నోటితో చెబితే కాదు కదా! అందుకే డాక్యుమెంట్ల కోసం పీఏ, పీఆర్వోను పురమాయించారు. ‘మీకు అన్ని పత్రాలను చూపిస్తా.. ఎవరు ఏం చేశారో మీరే ఆలోచించండి’ అని విలేకరులతో అంటూనే ఆ డాక్యుమెంట్ల ప్రతుల కోసం పక్కనే ఉన్న పీఏను అడిగారు.
ఆయన తెల్లముఖం పెట్టడంతో పీఆర్వోను అడిగారు. ఆయనదీ అదే పరిస్థితి. ఏవేవో ఫైళ్లు తీసుకొస్తున్నారే గానీ మంత్రి ఆరోపణను బలపరిచే, ఆయన అడుగుతున్న ఒక్క డాక్యుమెంట్‌ను కూడా ఇవ్వలేకపోయారు. చివరకు తాను కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి కాంతారావుకు రాసిన లేఖను ఇవ్వాలని అడిగారు. ఇదిగో అదిగో అనడమే తప్ప లేఖల కాపీలు మాత్రం మంత్రి చేతికి రాలేదు. అప్పటికే మూడు నాలుగుసార్లు అడిగారు. దీంతో మంత్రి స్వయంగా ముగ్గురు, నలుగురు అధికారులకు సైతం ఫోన్లు చేశారు. ‘నేను రాసిన లేఖ వాట్సాప్ చేయండి. మనం సీడబ్ల్యూసీకి పంపిన ప్రతిపాదనల కాపీని వాట్సాప్ చేయండి’ అంటూ ఆదేశించారు. అయినా ఆవైపు నుంచి స్పందన కరువైంది. చివరికి గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీ ఒకటి మాత్రం మంత్రి చేతికి వచ్చింది. ‘నేను కాంతారావుకు రాసిన లేఖ తీసుకురండి’ అంటూ మరోసారి ఆదేశించారు. వీటి కోసం మీడియా ప్రతినిధులు వేచి చూస్తునే ఉన్నారు. అయినా ఆ పత్రాలు రాకపోవడంతో మంత్రికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇక ఈ తిప్పల్ని ఇంకా కొనసాగిస్తే మీడియా ప్రతినిధుల ముందు పరువు తీసుకోవడం తప్ప ఇంకోటి కాదని గుర్తించారో ఏమో! వెంటనే సైలంట్ అయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రి తన శాఖకు సంబంధించిన డాక్యుమెంట్ల కోసం ఇంత తిప్పలు పడాల్నా? అధికారుల వైఫల్యమా? మంత్రికి తన శాఖపై పట్టులేనితనమా? అని ముక్కున వేలేసుకోవడం మీడియా ప్రతినిధుల వంతయింది.
డాక్యుమెంట్ల కోసం నానా తంటాలు పడిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ అయిన ఓ జీవో ప్రతిని మీడియా ప్రతినిధులకు ఇచ్చారు. 2022 ఆగస్టు 8వ తేదీన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 246 జారీ చేసింది. దానినే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు అందించారు. మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించి 45 టీఎంసీలు అని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. అయితే ఆ జీవోను పరిశీలించిన మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా అయోమయంలో పడిపోయారు. మంత్రి మాత్రం కేవలం మైనర్ ఇరిగేషన్‌కు 45 టీఎంసీల ఉత్తర్వులు ఇచ్చారని చెప్తుండగా.. ఆ జీవోలో మాత్రం స్పష్టంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కేటాయింపులు చేస్తున్నట్టు ఉత్తర్వులో ఉన్నది. అందులో భాగంగా మైనర్ ఇరిగేషన్ కింద ఆదా అయిన 45 టీఎంసీలతోపాటు పోలవరం మళ్లింపు ద్వారా తెలంగాణకు దక్కే 45 టీఎంసీల వాటాను కలుపుతూ 90 టీఎంసీల కేటాయింపును ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆ జీవో స్పష్టం చేసింది. దీంతో అసలు మంత్రికి డాక్యుమెంట్లు దొరక్కపోవడంతో ఈ జీవోను ఇచ్చి మరోసారి అభాసుపాలయ్యారంటూ మీడియా ప్రతినిధులు చర్చించుకున్నారు. మంత్రి నోటి నుంచి వచ్చే ఆరోపణలకు జీవోలోని వివరాలకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో బీఆర్ఎస్ను ఇరికించబోయి.. మంత్రే అడ్డంగా ఇరుక్కుపోయారని నవ్వుకున్నారు.