హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ) : ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి వల్ల ప్రభుత్వానికి లాభాలు వచ్చాయంటూ సోమవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కానీ నష్టం వచ్చిందనే వాస్తవాలను చెప్పకుండా లాభాలు వచ్చాయని అబద్ధాలు చెప్పారనే విమర్శలు వస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతితో ప్రభుత్వానికి నష్టమేనని స్వయంగా ఎగుమతి వ్యవహారాలు చూసే కీలక అధికారే గతంలో వెల్లడించారు. అయితే ఇప్పుడు నష్టమొచ్చినప్పటికీ భవిష్యత్‌కు ఇదొక మార్గం ఉంటుందని ఆయన తెలిపారు. కానీ మంత్రి మాత్రం తమకు లాభాలు వచ్చాయని చెప్పడం గమనార్హం. అయితే మంత్రి ఉత్తమ్‌కుమార్ బియ్యం ఎగుమతిలో పలు ఖర్చులను దాచిపెట్టి ఎఫ్‌సీఐ ధరకు, ఎగుమతి ధరకు పొంతన పెట్టి లెక్కలు చూపడం గమనార్హం. ఎఫ్‌సీఐ రాష్ర్టానికి క్వింటాల్‌కు రూ.3,446 ధర చెల్లిస్తుందని, ఫిలిప్పీన్స్‌తో రూ.3,600కు ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు. అయితే ఈ వివరాలు పరిశీలిస్తే ఎఫ్‌సీఐ ఇచ్చే ధరతో పోల్చితే ఎగుమతి ధర అధికంగా కనిపించినా ఇందులో ఖర్చులు పోగా తక్కువ ధరకే ఒప్పందం కుదరడం గమనార్హం.
ఎఫ్‌సీఐకి 25శాతం నూకతో బియ్యం సరఫరా చేస్తుంది. కానీ ఫిలిప్పీన్స్‌కు కేవలం 5శాతం నూకతో ఎగుమతి చేయాలి. ఈ నూక శాతం తగ్గింపును భర్తీ చేసేందుకు మిల్లర్లకు కిలోకు రూ.3 వరకు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇదిలా ఉంటే రైస్‌మిల్లు నుంచి కాకినాడ పోర్ట్ వరకు రవాణా, లోడింగ్, అన్లోడింగ్ మొత్తం బాధ్యత, ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇలా కిలోకు రూ.2వరకు ఖర్చవుతుంది. అంటే నూక శాతం తగ్గింపు, రవాణా, ఇతర ఖర్చులు కలిపి రూ.5వరకు కోత పడుతుంది. ఈ లెక్కన ఫిలిప్పీన్స్‌తో కిలో రూ.36తో ఒప్పందం చేసుకున్నప్పటికీ ఖర్చులు తీసేస్తే వాస్తవ ధర రూ. 31 మాత్రమేనని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎఫ్‌సీఐ కేజీ ధర రూ.34.46 కాగా ఖర్చులు పోగా ఎగుమతి ధర రూ.31 అవుతుంది. అంటే కిలోకు రూ.3.46 తక్కువకే బియ్యం ఎగుమతి చేస్తుండటం గమనార్హం. అంటే టన్నుకు రూ.3,460 నష్టం వస్తున్నట్టు తెలిసింది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7.87 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. కానీ మంత్రి ఉత్తమ్ మాత్రం బియ్యం ఎగుమతి వల్ల ప్రభుత్వానికి నికర లాభం రూ.1.13 కోట్లు వచ్చినట్టు వెల్లడించడం గమనార్హం.