Kodad | సూర్యాపేట, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : స్వయాన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో గోదావరి జలాలు చుక్క కూడా అందడం లేదు. ఈ నియోజకవర్గం పరిధిలోని మోతె, నడిగూడెం, మునగాల మూడు మండలాలకు కాళేశ్వరం పరిధిలోని ఎస్సారెస్పీ ఆయకట్టు కింద 42వేల ఎకరాలు రైతులు సాగు చేయగా, దాదాపు 38 వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఎండిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్తున్నా.. మంత్రి ఉత్తమ్ గానీ, ఎమ్మెల్యే పద్మావతి గానీ కనీసం రైతులను పరామర్శించలేదు.
సూర్యాపేట జిల్లాలో దాదాపు లక్షకుపైగా ఎకరాల్లో వరి ఎండిపోతుంటే రాజకీయాలకు సంబంధం లేని పాలనా యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదు. నీళ్లిస్తాం.. పంటలు వేసుకోండని ప్రభుత్వం చెప్పడంతో గత బీఆర్ఎస్ హయాంలో వచ్చినట్లే నీళ్లు వస్తాయనుకుని సూర్యాపేట జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టుతోపాటు ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగం వరి నాటింది. నాగార్జునసాగర్ ఆయకట్టుకు పెద్దగా ఇబ్బంది లేకపోగా, ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు నిండా మునిగారు. మంత్రి ఉత్తమ్ సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో పరిస్థితి ఘోరంగా తయారైంది. మోతె, నడిగూడెం, మునగాల మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి పైర్లు ఎండాయి. ప్రభుత్వం ఒక్క తడి నీళ్లు ఇచ్చినా పంట చేతికి వచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాకున్న నాలుగెకరాలతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరి నాటు పెట్టిన. సాగు నీరు రాకపోతే మూడు బోర్లు వేసిన. రెండు బోర్లల్లో కొద్దిగా నీళ్లు వస్తుంటే రేయింబవళ్లు ఉండి నాలుగెకరాలను కాపాడుకుంటూ వచ్చిన. పదిహేను రోజుల సంది బోర్లు పోస్తలేవు. మొత్తం పంటంతా ఎండింది. వరి ఈని గింజ పోసుకుంటున్న టైమ్‌లో నీళ్లు లేక ఆగమైనం. ఒక్క తడికి నీళ్లిచ్చినా పంట చేతికి వచ్చేది. ఇదివరకు కేసీఆర్ హయాంలో రెండు సీజన్లు రంది లేకుండా నీళ్లు వచ్చినయి. తెలంగాణ రాక మునుపు ఎట్ల ఉండెనో ఇప్పుడట్ల ఉంది పరిస్థితి. పొలాలు నెర్రెలు బారినయ్. మాయదారి ప్రభుత్వం మమ్మల్ని ఉంచేందుకు వచ్చిందో.. ముంచేందుకు వచ్చిందో తెలుస్తలేదు. ఎండిన పంటకు నష్టమైనా కట్టిస్తే బాగుంటది.
-బాణోతు వీరన్న, లాల్‌తండా, మోతె మండలం