హైదరాబాద్, మార్చి 9 ( నమస్తే తెలంగాణ ) : ఒకేరోజు 5 వేల మందికి బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించి కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ గిన్నిస్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ఘనత సాధించింది. శనివారం బ్రహ్మకుమారీస్ ప్రధాన కేంద్రమైన మౌంట్‌అబూలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ, విదేశాలకు చెందిన 5020 మంది హాజరయ్యారు. వీరికి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉషాలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పీ రఘురామ్ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాధి చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎడ్యుకేటర్ రిషీనాథ్ మాట్లాడుతూ.. 40 నిమిషాలపాటు అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చిన రఘురామ్‌ను ప్రశంసించారు.
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ, ఉపాధ్యాయులు హామీల అమలుకోసం ఉద్యమించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీల అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్సీ ప్రకటించి, మెరుగైన ఫిట్మెంట్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవి, వెంకటి మాట్లాడుతూ..పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దుచేయాలని, 2003 డీఎస్సీ టీచర్లకు ఓపీఎస్ అమలుచేయాలని, మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగయ్య, దుర్గాభవానీ, కోశాధికారి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు సోమశేఖర్, రాజశేఖర్‌రెడ్డి, నాగమణి పాల్గొన్నారు.