హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయంలో కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బిట్స్ పిలానీ మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలోని అగ్రిహబ్‌లో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య, బిట్స్ పిలానీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వీ రాంగోపాల్‌రావు సమక్షంలో అవగాహన ఒప్పందంపై ఆయా సంస్థల అధికారులు సంతకాలు చేశా రు.
ఈ ఒప్పందం పరిశోధనా ప్రాజెక్టుల రూపకల్పనకు, పీహెచ్డీ విద్యార్థుల పరిశోధనల్లో సలహాలకు దోహదం చేయనున్నట్టు బిట్స్ పిలానీ ఉప కులపతి ప్రొఫెసర్ రాంగోపాల్‌రావు పేర్కొన్నారు. అగ్రికల్చర్ వర్సిటీ ఉప కులపతి జానయ్య మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత ప్రాచీన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం రెండోదని, 2047 నాటికి మానవరహిత వ్యవసాయమే లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పరిశోధనా సంచాలకులు డాక్టర్ బలరాం, రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్ విద్యాసాగర్, బిట్స్ పిలానీ ప్రతినిధులు పాల్గొన్నారు.