StemCures | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): జీవశాస్ర్తాల రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు ఈ రంగంలో మరో భారీ పెట్టుబడి దక్కింది. అమెరికాకు చెందిన స్టెమ్‌క్యూర్స్ సంస్థ హైదరాబాద్‌లో అతిపెద్ద స్టెమ్‌సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. రూ.54 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 446 కోట్లు) పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్‌లో 150 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇందులో భాగంగా ముందుగా స్టెమ్‌సెల్ థెరపీకి ఉపయోగించే స్టెమ్‌సెల్స్ తయారీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
స్టెమ్‌క్యూర్స్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ సాయిరామ్ అట్లూరి బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో అమెరికాలోని బోస్టన్‌లో సమావేశమైన అనంతరం ఈ పెట్టుబడి ప్రణాళికను వెల్లడించారు. వివిధ రకాల తీవ్రమైన వ్యాధుల చికిత్సకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్టెమ్‌సెల్ ఉత్పత్తులను సరసమైన ధరలకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు వివరించారు. స్టెమ్‌క్యూర్స్ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంపట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. స్టెమ్‌సెల్ థెరపీ అనేది విభిన్నమైన చికిత్సా పద్ధతి అని, ఇది దేశంలోని రోగులకు అత్యంత నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందించేందుకు దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. భారత్‌లో స్టెమ్‌సెల్ థెరపీని రోగులకు మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు క్లినిక్స్‌తో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
తన స్వస్థలమైన హైదరాబాద్ వైద్య రం గంలో అనేక ఆవిష్కరణలకు కేంద్రంగా మారడం సంతోషంగా ఉన్నదని స్టెమ్క్యూ ర్ వ్యవస్థాపకుడు సాయిరామ్ అట్లూరి తెలిపారు. ఇప్పటికే అనేక అర్అండ్ డీ కేం ద్రాలు ఏర్పాటయ్యాయని, తాజాగా తా ము తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. తమను ఎంతగానో ప్రో త్సహించడంతోపాటు సహకారం అందించేందుకు ముందుకు రావడంపట్ల మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్ర స్తుతం తమ సంస్థ యూనివర్శిటీ ఆఫ్ హై దరాబాద్‌లోని ఆస్పైర్ బయోనెస్ట్లో స్టెమ్‌సెల్ లైన్‌కు సంబంధించిన ఆర్ అండ్ డీని ఏర్పాటు చేసిందని, తొలిదశ తయారీ ల్యా బ్ ప్రారంభానికి సిద్ధమైందని చెప్పారు.
హైదరాబాద్ ప్రస్తుతం 10 అగ్రశ్రేణి ఔషధ కంపెనీలుసహా వెయ్యికిపైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కేంద్రంగా ఉన్నది. టాప్-10 గ్లోబల్ ఇన్నోవేటర్ కంపెనీల్లో నాలుగు కంపెనీలు తమ ప్రత్యేక కేంద్రాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాయి. ఈ కేంద్రాలు కోర్ ఆర్ అండ్ డీ డిజిటల్, ఇంజినీరింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా రోగుల ప్రాణాలను కాపాడేందుకు సరసమైన ధరకు థెపరీలు, మెడికల్ డివైజెస్‌ను అందిస్తున్నాయి.
స్టెమ్‌క్యూర్స్ అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఒక మెడికల్ క్లినిక్. అనుభవజ్ఞులైన వైద్యుల బృందంతో కూడిన ఈ క్లినిక్ స్టెమ్ థెరపీకి ప్రసిద్ధి గాంచింది. ఇందులో చికిత్స కోసం అత్యంత నాణ్యమైన మూల కణాలను మాత్రమే ఉపయోగిస్తారు. స్టెమ్‌సెల్ థెరపీ అనేది నాన్ సర్జికల్ ప్రక్రియ. ఇందులో రోగి మూల కణాలను చికిత్సకు ఉపయోగిస్తారు. మూలకణాలు ఏ రకమైన కణంగానైనా మారగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గాయపడిన, వ్యాధిగ్రస్థులైన రోగులకు ఆ గాయమైన ప్రాంతంలో మూలకణాలను ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ మూలకణాలు కణజాలాన్ని సరిచేయడానికి, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.