హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): అమెరికాతో భారత్ బంధం బలమైందని, అమెరికాలో తెలుగు ప్రజలు ప్రభావశీలంగా ఉన్నారని అమెరికా రాయబార కార్యాలయ చార్జ్ డీ ఎఫైర్స్ జోర్గన్ అండ్రూస్ చెప్పారు. చాలా విషయాల్లో ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయని, వ్యాపార బంధం బలపడుతున్నదని తెలిపారు. ఒక్కటిగా ఉందాం.. బలంగా ఎదుగుదాం అనే నినాదంతో పనిచేద్దామని సూచించారు. అమెరికా 249వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం తాజ్ కృష్ణా హోటల్లో జరిగాయి. వేడుకలకు నేతృత్వం వహించిన యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ మాట్లాడుతూ మూడేండ్లపాటు తాను తెలంగాణలో ఉన్నానని, హైదరాబాద్ కాన్సులేట్‌తో అనుబంధం జీవితకాలం గుర్తుంటుందని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వ్యాఖ్యానించారు.
కాన్సులెట్ జనరల్‌గా లారా విలియమ్స్
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్‌గా త్వరలోనే లారా విలియమ్స్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనున్నది. కొత్త కాన్సులెట్ జనరల్ లారా విలియమ్స్ ఆగస్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు.