నిజామాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి యూరియా బస్తాల కోసం టోకెన్లను జారీ చేసేందుకు రైతులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకోవడం విమర్శలకు తావిస్తున్నది. కామారెడ్డి జిల్లా బీబీపేట ఠాణా ఇందుకు వేదికగా మారింది. మూడు వారాల నుంచి కామారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారు. శుక్రవారం రాత్రి బీబీపేట సొసైటీ వద్ద నిరీక్షించగా శనివారం 600 యూరియా సంచులు వస్తాయని సిబ్బంది చెప్పడంతో తెల్లవారుజాము నుంచే అన్నదాతలంతా వచ్చి సొసైటీ వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో ఘర్షణ తలెత్తడంతో పోలీసులు రంగ ప్రవేశంచేశారు. రైతులందర్నీ పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ హుకూం జారీ చేయగా.. మహిళలు, పురుషులు, వృద్ధులు ఠాణాకు వెళ్లారు. వేయిమందికి పైగా రైతులు పోగవడంతో వారిని సీఐ సంపత్, ఎస్సై ప్రభాకర్ ఠాణా ముందే నేలపై కూర్చో బెట్టారు. పోలీస్ స్టేషన్లో యూరియా బస్తాలకు టోకెన్లు అందిస్తున్న క్రమంలో మల్కాపూర్‌కు చెందిన అంబల్ల చిన్నరాకయ్య ఫిట్స్ వచ్చి పడిపోవడంతో దవాఖానకు తరలించారు. 930 మందికి యూరియా టోకెన్లు పంపిణీ చేసినట్టు ఎస్సై తెలిపారు. 660 యూరియా బస్తాలు రైతులకు అందాయి. మిగిలినవారికి యూరియా లోడ్ వచ్చాక ఇవే టోకెన్లపై పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో చాలా మందికి నిరాశ ఎదురైంది.
రైతులను ఠాణాలకు తరలిస్తరా? ; మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లాలో రైతులను పోలీస్ స్టేషన్‌కు తరలించిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్‌రెడ్డీ.. నీ చేతగాని పాలనతో రైతులను అరిగోస పెడుతున్నావు. అన్న దాతలను నడిరోడ్డుకు ఈడ్చి వికృతానందం పొందుతున్నావు’ అని మండిపడ్డారు. రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి, ఎరువులు పంపిణీ చేసే పరిస్థితులు తెచ్చిన వాడివిగా, చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదని హెచ్చరించారు. రైతులను నేరస్థులుగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన దుర్మార్గ వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని, తగిన సమయంలో బుద్ధి చెప్తుందని హరీశ్‌రావు హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్లో రైతన్నలు: ఇది రైతు సభ కాదు.. యూరియా రభస
‘అరెరే.. ఏందిది ఇంత మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారేంది’.. అనుకుంటున్నారా? లేక ఠాణాలో రైతుల సదస్సో.. సభనో జరుగుతున్నది అనుకుంటున్నారా? రెండూ కాదు.. కామారెడ్డి జిల్లా బీబీపేట సొసైటీ వద్దకు యూరియా కోసం శనివారం వందలాది మంది రైతులు తరలిరావడంతో చేసేదేంలేక చివరికి స్థానిక పోలీస్ స్టేషన్లో టోకెన్లు పంపిణీ చేశారు. ఠాణాకు రైతులు పోటెత్తడంతో ఇదిగో ఇలా ఆవరణలోనే ఖైదీల్లా కూర్చోబెట్టి పడిగాపులు కాయించారు. అప్పటికీ ఎండకు తాళలేక రైతు చిన్న రేఖయ్య ఫిట్స్‌తో పడిపోవడంతో పోలీస్ వాహనంలో దవాఖానకు తరలించారు.