హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): నాడు మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులకు ఎరువుల కొరత రాకుండా చేశారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ముందుచూపులేమి,చిత్తశుద్ధి లేకపోవడం, ప్రణాళికలోపంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. సీజన్‌కు మూడునెలల ముందే కేసీఆర్ యూరియా తెప్పించి.. సరఫరాకు ప్రణాళిక రూపొందించేవారని తెలిపారు. ప్రస్తుతం సీజన్ మొదలైన తర్వాత తీరిగ్గా యూరియా కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, రైతుల ఇబ్బందులు ముమ్మాటికి కాంగ్రెస్ సర్కారు వైఫల్యమేనని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఎరువుల కొరతకు గల కారణాలు, నాడు కొరతను ఏ విధంగా అధిగమించారనే అంశాలపై ఆయన నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు..
నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో యూరియా కొరతకు కారణమేంటి?
నిరంజన్‌రెడ్డి: రాష్ట్రంలో గత పదేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుతం యూరియా కొరత ఏర్పడింది. అది కూడా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా యూరియా కోసం రైతుల క్యూలైన్లే కనిపిస్తున్నాయి. ఈ దుర్భర పరిస్థితికి రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలే కారణం. ఈ సర్కారుకు రైతులపై ప్రేమ లేదు, రైతుల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి కనిపించడంలేదు. కేంద్రం నుంచి యూరియా తెప్పించడంలో, ఇక్కడ సరఫరాలో ముందస్తు ప్రణాళిక లేదు. సీఎం రేవంత్‌రెడ్డికి అనుభవం లేదు, వ్యవసాయశాఖ మంత్రి చర్యలు శూన్యం.
సర్కారు విఫలమైందా?
కచ్చితంగా.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరత ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు వైఫల్యమే. లేదంటే పదేండ్లపాటు ఉత్పన్నం కాని యూరియా కొరత కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఏడాదిలోనే ఎందుకు వచ్చిందనేది అలోచించాలి. ఏనాడైనా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల ప్రత్యేకంగా యూరియా కోసం ఢిల్లీకి వెళ్లిన సందర్భాలున్నాయా? ఏదో రాజకీయ పనులపై ఢిల్లీ వెళ్లిన సీఎం పనిలో పనిగా ఒకసారి కేంద్రమంత్రి నడ్డాను కలిశారు. ఇక బీసీ ధర్నా కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రి తుమ్మల అప్పుడు కేంద్ర మంత్రిని కలిశారు. ఇదేనా రైతులపై వారికున్న చిత్తశుద్ధి. కానీ కాంగ్రెస్ సర్కారు పెద్దలు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. వాళ్లు ఇచ్చేది ఇస్తరు.. వచ్చేది వస్తదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇది ఆ పార్టీ నేతల వైఫల్యమే.
బీఆర్ఎస్ హయాంలో యూరియా కొరతను ఎలా అధిగమించారు?
కేసీఆర్‌కు అన్ని అంశాల్లో ముందుచూపు ఎక్కువ. రైతులు, వ్యవసాయంపై మరింత ఎక్కువగా ఉండేది. అందుకే రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువుల కొరత రాకుండా జాగ్రత్తపడేవారు. సీజన్‌కు మూడునెలల ముందే ఎరువుల సరఫరాపై ప్రణాళిక సిద్ధం చేసేవారు. ఆయనే స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, అధికారులతో సంప్రదింపులు జరిపి రాష్ర్టానికి రావాల్సిన యూరియా, ఇతర ఎరువులను తెప్పించేవారు. ఇక్కడ మమ్మల్ని కూడా పరుగులు పెట్టించేవారు. యూరియా కోసం ఢిల్లీలో కేసీఆర్ పడిన పాట్లలో ఒక ఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. అప్పుడు కేంద్ర ఎరువులశాఖ మంత్రిగా అనంతకుమార్ ఉండేవారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో యూరియా వినియోగం పెరుగుతుందని కేసీఆర్ ముందే గ్రహించారు. అప్పుడు ఆయనే స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
అప్పటికే కేంద్రమంత్రితో ఆయనకున్న పాత పరిచయంతో కేసీఆర్ ఒక ప్రపోజల్ పెట్టారు. దేశంలో యూరియా వినియోగం ఎక్కడా లేని సమయంలో గోదాముల్లో నిల్వ చేస్తే ఏం లాభమని, తమకు సరఫరా చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన డబ్బును ముందే చెల్లిస్తామని కూడా చెప్పారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దేశంలో యూరియా వినియోగం ఎక్కువగా ఉండదు కాబట్టి.. ఆ సమయంలో తమకు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ చేసిన ప్రతిపాదన ఎవరికీ ఇబ్బంది లేకపోవడంతో కేంద్ర మంత్రి కూడా ఒకే చెప్పారు. అప్పటినుంచి రెండుమూడు నెలల ముందే కేంద్రం నుంచి రాష్ర్టానికి యూరియా తీసుకొచ్చేవాళ్లం. ఇక్కడ కనీసం రెండు లక్షల టన్నుల యూరియా బఫర్‌స్టాక్ ఉండేలా చూసుకునేవాళ్లం. ఆ తర్వాత నెలవారి కేటాయింపుల కోసం మళ్లీ ప్రయత్నాలు చేసేవాళ్లం. సీజన్ మొదలైందంటే చాలు కేసీఆర్ 24 గంటలపాటు యూరియా సరఫరాను మానిటరింగ్ చేసేవారు. ఏ మాత్రం షార్టేజీ కనిపించినా ఢిల్లీకి పరుగులు పెట్టించేవారు. ఆయనతోపాటు నేను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి ఒకటిరెండు రోజులు అక్కడే ఉండి కోటా ట్రైన్లో ఎక్కిన తర్వాతే మేం విమానం ఎక్కేవాళ్లం.
ఆర్ఎఫ్సీఎల్ ఆశించిన స్థాయిలో ఉత్పత్తి చేయకపోవడానికి కారణం?
రాష్ట్రంలోనే యూరియా ఉత్పత్తి అయితే రైతులకు ఇబ్బందులు తప్పుతాయనే ఉద్దేశంతో రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని నాటి సీఎం కేసీఆర్ ప్రోత్సహించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థే అయినప్పటికీ ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున తన వాటా ప్రకారం నిధులు కూడా కేటాయించారు. తద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఆయన భావించారు. ఇందుకు అనుగుణంగానే ఇక్కడ ఉత్పత్తయిన యూరియా రాష్ర్టానికి తొందరగా రావడంతో సమస్య రాలేదు. అయితే ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు, యూరియా ఉత్పత్తి చేయడం లేదు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకున్న పాపానపోలేదు. పోనీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన నియోజకవర్గానికి అనుకొని ఉండే ఫ్యాక్టరీకి వెళ్లి ఒక్కసారి కూడా సమీక్షించలేదు. ఫ్యాక్టరీ ఎందుకు నడవడం లేదని పరిశీలించలేదు. ఇదీ ఆ రెండు పార్టీల చిత్తశుద్ధికి నిదర్శనం. ఒకవేళ ఆ ఫ్యాక్టరీ అనుకున్న స్థాయిలో యూరియా ఉత్పత్తి చేసి సరఫరా చేసి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు.
స్వదేశీ ఉత్పత్తి యూరియా తీసుకోవడంలో విఫలమైందా?
కాంగ్రెస్ సర్కారు చేసిన మరో తప్పిదం కూడా యూరియా కొరతకు కారణమైంది. కేంద్రం రాష్ర్టాలకు స్వదేశంలో ఉత్పత్తయిన యూరియాను, విదేశాల నుంచి వచ్చే యూరియాను కేటాయిస్తుంది. అయితే గతంలో మేమంతా కూడా స్వదేశంలో ఉత్పత్తి అయ్యే యూరియా వాటాను ఎక్కువగా కేటాయించాలని కోరేవాళ్లం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు విదేశీ కేటాయింపులకు అంగీకరించింది. దీంతో విదేశాల నుంచి వచ్చే యూరియా ఆలస్యమవుతుండటంతో కొరత ఏర్పడుతున్నది. గతంలోనూ కొంత విదేశీ యూరియా వచ్చేది. అయితే ఒకవేళ మనకు కేటాయించిన షిప్ ఆలస్యమైతే.. ఇతర రాష్ర్టాలను రిక్వెస్ట్ చేసి వారికి కేటాయించిన షిప్‌ల నుంచి కొంత యూరియాను మన రాష్ర్టానికి తీసుకొచ్చేవాళ్లం. మన షిప్ వచ్చినప్పుడు ఆ రాష్ర్టాలకు తిరిగి ఇచ్చేవాళ్లం. ఇలా స్వదేశంలో ఉత్పత్తి అయ్యే యూరియాను అధికంగా కేటాయించేలా చేయడంతోపాటు విదేశీ యూరియాను కూడా సకాలంలో వచ్చేలా చూసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఒక్క అధికారి, మంత్రి కూడా షిప్‌ల వద్దకు వెళ్లడం లేదు.. యూరియా సమీక్షించడం లేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నాయి. అసలు బాధ్యులు ఎవరు. తప్పెవరిది?
యూరియా కొరతకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఆడుతున్న రాజకీయ క్రీడలో రైతులు సమిధలవుతున్నారు. ఈ రెండు పార్టీలు దేశానికి అన్నంపెట్టే రైతులతో రాజకీయం చేస్తున్నాయి. యూరియా సమస్యను పరిష్కరించాల్సిపోయి ఈ వైఫల్యం నుంచి తప్పించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నించడం బాధాకరం. రాష్ర్టానికి కేటాయించిన ఎరువులను సకాలంలో సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైతే.. వాటిని పట్టుబట్టి తెచ్చుకోవడంలో రాష్ట్ర సర్కారు విఫలమైంది. ఆయా రాష్ర్టాల ఇండెంట్ ప్రకారం కేంద్రం యూరియా కేటాయిస్తుంది. కానీ ఆ తర్వాత కేంద్రాన్ని ఒప్పంచి.. ఒత్తిడి చేసి రాష్ర్టానికి అవసరమైన యూరియాను తెచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. ఇందుకోసం నిరంతరం అలర్ట్‌గా ఉండాలి. విదేశాల నుంచి ఎరువుల నౌకలు రాగానే అక్కడికి వెళ్లి మనకు రావాల్సిన కోటాను తెచ్చుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపించడం లేదు.