రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఐకేపీ మహిళా గ్రూప్ ఎరువుల దుకాణానికి రైతులు గురువారం ఉదయం 5గంటల నుంచే తరలివచ్చారు. వాన భారీగా పడడంతో చెప్పులు లైన్లో పెట్టి, గోదాం గోడ పకన నిల్చున్నారు. ఉదయం 11 గంటలైన దుకాణదారులు ఎవరు రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పహారాలో 800 మందికి టోకెన్లు ఇచ్చారు. 440 బ్యాగుల యూరియా ఉందని, మరో రెండు రోజుల్లో మరింత వస్తుందని ఏవో దుర్గరాజు తెలిపారు.
– ముస్తాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మార్కెట్ యార్డులోని ఎరువుల గోడౌన్ వద్దకు యూరియా కోసం వచ్చిన రైతులు విసుగు చెంది ప్రభుత్వ దవాఖాన రోడ్డుపై గురువారం ధర్నా చేపట్టారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రావడంతో రైతులకు, ఎమ్మెల్యేకు వాగ్వాదం జరిగింది. తర్వాత ఒక కట్ట చొప్పున యూరియా పంపిణీ చేశారు.
– ఇల్లెందు
రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. గురువారం కందుకూరులో రైతులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఆధార్ కార్డులు, భూమి పాస్ బుక్కులు తీసుకుని లైన్ కడితే పోలీసులతో యూరియా టోకెన్లు ఇప్పిస్తున్నట్టు రైతులు ఆమెకు వివరించారు. బ్లాక్ మార్కెట్లో యూరియా దొరుకుతున్నట్టు పేర్కొనడంతో వెంటనే రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. వ్యవసాయ అధికారి లావణ్య, పీఏసీఎస్ కార్యదర్శి యాదగిరిరెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, 50 సార్లకుపైగా ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ ఒక్కసారైనా యూరియా గురించి అడిగారా? అని ప్రశ్నించారు. కేంద్రం వివక్షతోనే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు.
– కందుకూరు
టేకులపల్లి, ఆగస్టు 28: భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో రైతులు యూరియా కోసం గురువారం భారీ సంఖ్యలో గోదాముట వద్దకు క్యూ కట్టారు. యూరియా అందని రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులే యూ రియా బస్తాలను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ టేకులపల్లి మండల సోషల్‌మీడియా ప్రతినిధి మాలోత్ నివాస్.. టేకులపల్లి మండలంలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. ఈ పోస్టు పట్ల ఎమ్మెల్యే సోదరుడు సురేందర్ ఆగ్రహించాడు. మాలోత్ నివాస్‌కు ఫోన్‌చేసి ‘మా అన్నపై అసత్య ప్రచా రం చేస్తే వేళ్లు కట్ చేస్తా’ అంటూ బెదిరించారు. దీనిపై నివాస్.. టేకులపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరువురిని పిలిపి విచారిస్తున్నారు.
రెండు రోజుల్లో రైతులందరికీ సరిపడా యూరియా ఇవ్వకపోతే ఎక్కడికక్కడ రైతులతో కలిసి ధర్నా చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. గురువారం ఆయన జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు (జే)లోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. రైతులు యూరియా కోసం తిండీతిప్పలు మాని తెల్లవారు జాము నుంచే ఎరువుల కేంద్రాల వద్దకు వస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు ఎరువుల కోసం అధికారుల కాళ్లు పట్టుకునే స్థితికి వచ్చిందని మండిపడ్డారు. ఎరువుల సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు.
– పాలకుర్తి
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు యూరి యా కోసం అరిగోస పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటలో యూరియా దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తెలుసుకొన్న మాజీ ఎమ్మెల్యే ఆల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్దకు వెళ్లి అన్నదాతలతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు. సమస్య తీర్చాలని ఏవో అనిల్‌కుమార్‌ను కోరారు.
– మూసాపేట
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో యూరియా అందక రైతులు అరిగోస పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ధ్వజమెత్తారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి సకాలంలో యూరియా అందించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
– మహబూబాబాద్ రూరల్
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం దుగ్నెపల్లి హాక సెంటర్ వద్ద యూరియా కోసం క్యూ కట్టిన.. రైతు బొంబురపు రాజిరెడ్డి ఫిట్స్‌తో కుప్పకూలిపోయాడు. గంటల తరబడి నిల్చొని ఉండడంతో అస్వస్థతకు గురై కిందపడిపోగా, తోటి రైతులు 108లో చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు.
-చెన్నూర్ రూరల్
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు గోసపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని నంది మేడారం సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులను చూసి ఆగారు. డగా, అటుగా వెళ్తున్న ఆయన వారిని చూసి ఆగారు. ఇద్దరు మంత్రులున్నా సరిపడా యూరియా తెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
– ధర్మారం
ములుగు, ఆగస్టు28(నమస్తేతెలంగాణ) : గంటల తరబడి క్యూలో ఉండి యూరియా కోసం పడిగాపులు కాసినా యూరియా టోకె న్లు ఇవ్వకపోవడంతో గురువారం ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్‌రెడ్డి, నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులు రైతులను శాంతింపజేసి అందరికీ టోకెన్లు ఇప్పిస్తామని చెప్పి వారిని పీఏసీఎస్ కార్యాలయానికి తీసుకొని వెళ్లారు. ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర పీఏసీఎస్‌కు చేరుకుని స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ములుగు మండలం దేవగిరిపట్నంకు చెందిన కౌలు రైతు యాపాటి తిరుపతిరెడ్డి సరిపడా యూరియా అందించాలని కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నాడు. దీంతో కలెక్టర్ అలా చేయవద్దని, రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.