సీరోలు(కురవి) / బయ్యారం / గన్నేరువరం / నిజాంసాగర్, డిసెంబర్ 28: యూరియా కోసం రైతులు నిత్యం అవస్థలు పడుతున్నారు. యూరియా వచ్చిందన్న సమాచారం అందగానే రైతులు పీఏసీఎస్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మహిళలు కూడా పాస్‌పుస్తకాలతో చేరుకొని బారులుతీరుతున్నారు. రైతులు భారీగా తరలివస్తుండటంతో అందరికి అందడం లేదు. దాదాపు సగం మంది రైతులు గంటలతరబడి క్యూలో నిల్చొని యూరియా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. క్యూలో తోపులాటలు జరుగుతుండటంతో పోలీస్ పహారా మధ్య పంపిణీ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కాంపల్లిలోని సహకార సంఘం వద్ద ఆదివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా దొరుకుతుందో లేదోనన్న ఆందోళనతో తోపులాట జరిగింది. ఆ తరువాత పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు. ఒక్కో బస్తా మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బయ్యారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులు యూరియా పంపిణీ చేశారు. కొన్ని రోజులుగా కార్డుల ద్వారా పంపిణీ చేసిన అధికారులు ఆదివారం లిస్ట్ ద్వారా అందజేస్తామనడంతో గందరగోళం నెలకొన్నది. ఈ క్రమంలో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకున్నది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలోని పీఏసీఎస్‌కు 340 యూరియా బస్తాలు రాగా 150 మంది రైతులు తరలివచ్చారు. ఎకరానికి బస్తా చొప్పున అందజేశారు. సుమారు 50 మందికి దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని అచ్చంపేట సొసైటీకి ఆదివారం ఉదయం 444 బస్తాల యూరియా రావడంతో ఒక్క సారిగా రైతులు ఎగబడ్డారు. సొసైటీ పరిధిలో నిజాంసాగర్, సుల్తాన్‌నగర్, మాగి, గోర్గల్, నర్సింగ్‌రావ్‌పల్లి, మంగ్లూర్, వెల్గనూర్, అచ్చంపేట, ఆరేపల్లి, మర్పల్లి, బ్రహ్మణపల్లి, లింగంపల్లి గ్రామాల రైతులు తరలివచ్చారు. కేవలం 444 బస్తాల యూరియా అందుబాటులో ఉండగా దాదాపు వెయ్యి బస్తాలకు సరిపడా పాస్‌పుస్తకాలతో రైతులు రావడంతో కొద్దిసేపు పంపిణీ చేసి నిలిపివేశారు. దీంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.