సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 02:20:08

కేంద్రం తీరువల్లే యూరియా కష్టాలు

కేంద్రం తీరువల్లే యూరియా కష్టాలు

  • ఇంకా 4.64 లక్షల మెట్రిక్‌ టన్నులు బకాయి
  • సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రికి చెప్పినా స్పందన లేదు
  • రాష్ట్రంలో సాగు పెరిగింది.. అదనంగా ఇవ్వాలి
  • వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రప్రభుత్వం రాష్ర్టానికి కేటాయించిన ఎరువులను సక్రమంగా సరఫరా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేదికాదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు ఒక్క నెల కూడా పూర్తిస్థాయిలో ఎరువులను సరఫరా చేయలేదని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 31వరకు రాష్ర్టానికి కేంద్రం 8.69 లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా కేటాయించి 6.15 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేసిందన్నారు. సెప్టెంబర్‌ నెల 2.10 లక్షల మెట్రిక్‌ టన్నులు కలిపితే కేంద్రం నుంచి 4.64 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా రావాల్సి ఉందని తెలిపారు. 2020-21 వానకాలానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం 10.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాతోపాటు, 11.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇతర ఎరువులు కలిపి మొత్తం 22.30 లక్షల టన్నులను కేటాయించిందన్నారు. మిగతా ఎరువుల సరఫరాలో సమస్య లేనప్పటికీ యూరియా ఇవ్వటంలో ఇబ్బందులున్నట్టు వెల్లడించారు.

 ఈ సీజన్‌లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని, దీన్ని ముందే అంచనావేసిన సీఎం కేసీఆర్‌ స్వయంగా కేంద్రమంత్రికి ఫోన్‌ చేసి మాట్లాడారని వివరించారు. తాను స్వయంగా రెండుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం కలుగలేదని అన్నారు. రాష్ట్రంలో గతేడాది వానకాలంలో 1.03 కోట్ల ఎకరాల్లో పంటలు సాగుచేస్తే ఈ యేడు ఇప్పటికే 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు వేశారని తెలిపారు. ఇది 36% అధికమని తెలిపారు. పెరిగిన సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.    


logo