హైదరాబాద్, ఫిబ్రరి 9(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనమండలి సభ్యులను ఉద్దేశించి ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమా రం రేపుతున్నాయి. ‘కౌన్సిల్లో కూర్చుంటే ఇరానీ కేఫ్‌లో కూర్చొని రియల్ఎస్టేట్ కొనుగోలు, అమ్మకాలు చేసినట్టు అనిపిస్తుంది’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం శాసనమండలి అట్టుడికింది. ‘సీఎం సారీ చెప్పాల్సిందే’నంటూ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగలేదు. పలువురు మంత్రులు వచ్చి సీఎం తరఫున తాము సమాధానం ఇస్తామన్నా సభ్యులెవరూ ఒప్పుకోలేదు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదుసార్లు మండలి వాయిదాపడింది. ముఖ్యమంత్రి వచ్చేవరకు సభను నడిపించబోమంటూ ఎమ్మెల్సీలు భీష్మించారు. దీంతో చివరకు సాయంత్రం 6.50 గంటలకు ఎలాంటి చర్చలేకుండానే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటిస్తూ సభను శనివారానికి వాయిదా వేశారు.
మండలిని అగౌరపరచడమే
శాసనమండలి, ఎమ్మెల్సీలనుద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని, చట్టసభలను, సభ్యులను కించపర్చడమే అవుతుందని బీఆర్ఎస్ సభ్యులందరూ మూకూమ్మడిగా నిరసన తెలిపారు. సీఎం స్వయంగా మండలికి వచ్చి క్షమాపణ చెప్పేవరకు సభను నిర్వహించవదని చైర్మన్‌ను కోరుతూ పోడి యం వద్ద బైఠాయించారు. శాసనమండలి శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు లేచి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయనే వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. సీఎం శాసనసభలో ఉన్నారని, ఆయన తరఫున తాము సమాధానం చెప్తామని మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు చెప్పగా.. తాము ఒప్పుకొనేదిలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తేల్చిచెప్పారు. దీనిపై చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేయగా ఎమ్మెల్సీలు పట్టు వీడలేదు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మండలికి వచ్చి పలువురు ఎమ్మెల్సీలు, చైర్మన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఫలితం లభించలేదు.
మాటజారిన జూపల్లి
ఓవైపు ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తుండగా.. మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సీట్లు ఇచ్చిన తీరుపై చేసిన వ్యాఖ్య లు గందరగోళానికి దారితీశాయి. ఆయన మాటలపై పలువురు ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త ఎమ్మెల్సీల పరిచయ కార్యక్రమం..
ఈ గందరగోళంలోనే.. ఇటీవల కొత్తగా ఎం పికైన ఇద్దరు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్‌గౌడ్‌లను చైర్మన్ సభకు పరిచయం చేశారు. సభ వాయిదా పడిన అనంత రం మంత్రులు జూపల్లి, శ్రీధర్‌బాబు, తుమ్మలతో బీఆర్ఎస్ సభ్యులు పిచ్చాపాటి మాట్లాడుతుండగా బల్మూరి వెంకట్, మహేశ్‌కుమార్‌గౌడ్ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కవిత వారికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘సభలో ఎలా ఉండాలో చూసి నేర్చుకో..ఎక్స్పీరియన్స్ అవుతుంది’ అని బల్మూరి వెంకట్ భుజంపై చేయివేసి చెప్పారు.
పీవీకి భారతరత్నపై తీర్మానం
వాయిదా అనంతరం సభ సమావేశం కాగానే.. మాజీ ప్రధాని పీవీకి కేంద్రం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో అభినందన తీర్మానాన్ని ఆమోదించారు. పీవీకి భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులంతా ముక్తకంఠంతో ఆమోదించారు.