UPS | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): అప్పర్ ప్రైమరీ స్కూళ్లు.. వీటినే ప్రాథమికోన్నత బడులంటారు. 1 -7 తరగతుల వరకు ఉండే ఈ బడులు ఇక కాలగర్భంలో కలవనున్నాయి. వీటిని రద్దుచేసి, ప్రాథమిక బడుల్లో విలీనంచేసే అంశాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పరిశీలిస్తుంది.
ఇదే జరిగితే రాష్ట్రంలోని 3,144స్కూళ్లు కనుమరుగు కానున్నాయి. ఇటీవలి నిర్వహించిన విద్యాసంస్కరణల క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ప్రాథమికోన్నత బడులపై చర్చ జరిగింది. విలీన అంశంపై అధ్యయనం చేసి నివేదికను అందించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను ఆదేశించింది. నివేదిక అనంతరం ప్రాథమికోన్నత బడుల విలీనం లాంఛనమేకానుంది.
సర్కారు బడుల్లో కొంత కాలంగా ఎన్రోల్మెంట్ తగ్గుతున్నది. గతంలో 23 లక్షలుండగా, ఈ ఏడాదికి ఎన్రోల్మెంట్ 20- 18లక్షలకు తగ్గింది. 65.47శాతం సర్కారు బడులుంటే.. ఎన్రోల్మెంట్ 34.23శాతం మాత్రమే. ప్రాథమికోన్నత బడుల విషయానికి వస్తే 3,144 స్కూళ్లల్లో 15,491 మంది విద్యార్థులున్నారు. వీటిల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని పరిశీలిస్తే 1: 14గా ఉంది.
అంటే విద్యార్థులు తక్కువ ఉండగా, టీచర్ల సంఖ్య అధికంగా ఉంది. ఎన్రోల్మెంట్ ఏటా తగ్గుతుండటంతో కొంతకాలంగా బడుల రేషనలైజేషన్‌ను అమలుచేస్తున్నారు. ఇటీవలీ టీచర్ల బదిలీల్లోనూ అంతర్గతంగా బడుల రేషనలైజేషన్‌ను అమలుచేశారు. దీనికి కొనసాగింపుగా ప్రాథమికోన్నత బడులను ప్రాథమిక బడుల్లో విలీనంచేసేందుకు రంగం సిద్ధంచేస్తుంది. 1,864 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లుండగా.. ఇందులో పనిచేస్తున్న 1,617 మంది టీచర్లను ఇతర స్కూళ్లకు బదిలీచేయనుంది. దీంతో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు మూతపడ్డట్టే.