ఖైరతాబాద్, సెప్టెంబర్ 4: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో బీసీ వర్గాలపై అగ్రవర్ణాలకు చెందిన దుండగులు దాష్టీకానికి ఒడిగట్టారు. ఆరుగాలం కష్టపడి స్థలం కొనుక్కొని 20 ఏండ్ల క్రితం ఇల్లు కట్టుకొని జీవిస్తున్న ఓ కుటుంబంపై దాడి చేసి బలవంతంగా కబ్జా చేసేందుకు యత్నించారు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై తీవ్రంగా దాడులు చేసి గాయపర్చారు. వారి దాడిలో గాయపడిన ఇంటి యజమాని కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు ఘటన వివరాలను యాదవ హక్కుల పోరాట సమిటీ జాతీయ అధ్యక్షుడు మేకల రాములుయాదవ్ హైదరాబాద్‌లో వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన బాధితులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కొడంగల్‌లోని మద్దూరు మండలం చింతల్‌దిన్నె గ్రామంలో మండి భీమప్పయాదవ్ 20 ఏండ్ల క్రితం 999 గజాల స్థలం కొనుగోలు చేశాడని తెలిపారు.
అందులో చిన్న ఇల్లు కట్టుకొని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడని చెప్పారు. గ్రామానికి చెందిన పల్లె చిన్న అనివిరెడ్డి, పల్లె వెంకట్‌రెడ్డి, పల్లె బుగ్గారెడ్డి, పల్లె రాజశేఖర్‌రెడ్డి, పల్లె రాజిరెడ్డి, పల్లె విష్ణువర్ధన్‌రెడ్డి ఆ భూమిపై కన్నెసి ఆక్రమించుకోవాలన్న కుట్రజేశారని చెప్పారు. గత నెల 25న ఆ ఇంటిపై దాడి చేసి భీమప్ప భార్య, ఆర్మీ జవాన్‌గా పనిచేస్తూ సెలవుల్లో వచ్చిన కొడుకు మండి శ్రీనివాస్‌యాదవ్‌పై దాడిచేశారని వివరించారు. వారి దాడిలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నదని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో బడుగులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మీ జవాన్‌పై దాడిచేయడం సిగ్గుచేటని, తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో యాదవ సంఘాలన్నింటినీ ఐక్యంగా పోరాడుతామని హెచ్చరించారు.
ప్రాణహాని ఉంది: బసమ్మ
ప్రభుత్వ రికార్డుల్లోనూ తమ పేరిటే స్థలం ఉన్నదని, ఆస్థి పన్నుతోపాటు విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నామని మండి భీమప్పయాదవ్ భా ర్య, బాధితురాలైన బసమ్మ తెలిపారు. ఈ నెల 25న తమపై దాడి చేసిన వెంటనే మద్దూరు పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారితో ప్రాణహాని ఉన్నదని, సీఎం రేవంత్‌రెడ్డి స్పం దించి న్యాయం చేయాలని కోరారు.