PCC Chief | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ)/కొల్లాపూర్: కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మరింత ముదురుతున్నది. టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు గాంధీ భవన్లో నిరసనను, ధర్నాలను కొనసాగిస్తున్నారు. అసంతృప్త నేతలు ఏకంగా గాంధీభవన్‌లో టెంట్లు వేసి ధర్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీకి చెందిన పలు నియోజకవర్గాల, గద్వాల, మేడ్చల్ కార్యకర్తలు గాంధీభవన్‌లోనే మకాం వేశారు.
తమ నేతకు న్యాయం జరిగే వరకు గాంధీభవన్‌ను వీడేది లేదని తేల్చి చెప్తున్నారు. పీసీసీ చీఫ్ ‘రేవంత్‌రెడ్డి కాదు.. రేటెంతరెడ్డి’ అంటూ గాంధీభవన్ మెట్లపై రేవంత్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. గద్వాల నుంచి టికెట్ ఆశించిన కురువ విజయ్ తన నిరసనగళాన్ని మరింత పెంచారు. అమరవీరుల స్థూపం వద్ద రేవంత్‌కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. 65 టికెట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారంటూ, రేవంత్ నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు సిగ్గు సిగ్గు అంటూ, కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్న రేవంత్ ఖబడ్దార్ అంటూ, కాంగ్రెస్ టికెట్ ఫర్ సేల్ కేరాఫ్ రేవంత్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
గాంధీభవన్‌ను ముట్టడించిన మేడ్చల్ కార్యకర్తలు
మేడ్చల్ అభ్యర్థిగా వజ్రేశ్యాదవ్ను ప్రకటించడంతో అక్కడ పోటీపడుతున్న మరో నేత హరివర్ధన్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన హరివర్ధన్‌రెడ్డి వర్గీయులు.. సోమవారం గాంధీభవన్‌ను ముట్టడించారు. అప్పుడే అక్కడ మీడియా సమావేశం నిర్వహిస్తున్న కొల్లాపూర్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావును అడ్డుకున్నారు. దీంతో ఆయన ప్రెస్‌మీట్‌ను మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా వజ్రేశ్యాదవ్కు ఇచ్చిన టికెట్‌ను వెనక్కి తీసుకోవాలని, ఆ టికెట్‌ను హరివర్ధన్‌రెడ్డికి కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాంధీభవన్ ఆవరణలోని రేవంత్ కటౌట్‌ను చించివేశారు. బహదూర్‌పుర నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుల నిరసన రెండో రోజూ కొనసాగింది. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించారు. కార్వాన్ టికెట్ ఉస్మాన్ బిల్ అల్హజరీకి బీఫాం ఇవ్వవద్దంటూ ఆ ప్రాంత నేతలు ఇన్చార్జి మాణిక్ ప్రభు ఠాకూర్‌కు వినతిపత్రం అందజేశారు.
నిలదీస్తే వేటే..
కాంగ్రెస్‌లో రేవంత్ పోకడలు శృతిమించాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందుకే ప్రశ్నించే వాళ్లను చూసి ఓర్వలేకపోతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఇందులో భాగంగానే తనకు టికెట్ దక్కకపోవడంపై ఆదివారం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, గద్వాల నేత కురువ విజయ్‌కుమార్‌ను క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసింది. ఆయనతోపాటు బహదూర్‌పుర నేత ఖలీల్‌పై కూడా వేటు వేసింది. ఈ చర్యలపై పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. అధిష్ఠానం చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే గతంలో అధిష్ఠానంపై విపరీత వ్యాఖ్యలు చేసిన సీనియర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీస్తున్నారు.
రేవంత్ తీరుతో గాంధీభవన్‌కు తాళం
రేవంత్ తీరుతో రెండు రోజులుగా గాంధీభవన్‌కు తాళం పడిందని, పారాచూట్ నేతలకు టికెట్లు అమ్ముకున్నారని పీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్‌రావు విమర్శించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలోని తన ఫాంహౌస్‌లో కాంగ్రెస్ ఆశావహులు, పార్టీనేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి చింతలపల్లితోపాటు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. జగదీశ్వర్‌రావు మాట్లాడుతూ.. కొల్లాపూర్ నుంచి రెబల్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. నెల కిందట పార్టీలోకి వచ్చిన పారాచూట్ నేత జూపల్లి కృష్ణారావును కచ్చితంగా ఓడించి తీరుతామని ఈ సందర్భంగా శపథం చేశారు. నాగం మాట్లాడుతూ.. కొల్లాపూర్‌లో పార్టీని నమ్ముకొని ఉన్న జగదీశ్వర్‌రావుకు ఎందుకు టికెట్ కేటాయించలేదో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
డీకే శివకుమార్ వద్దకు తెలంగాణ నేతల క్యూ
నిన్నటిదాకా ఢిల్లీ బాస్‌ల చుట్టూ తిరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హస్తిన మరింత దూరంగా మారింది. ఇప్పుడు నేరుగా కాకుండా వయా బెంగళూరు వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. పార్టీ టికెట్లు ఆశిస్తున్నవారు చాలామంది కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వద్దకు వెళ్లి పైరవీలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం టికెట్ ఆశిస్తున్న దండెం రాంరెడ్డి కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్లి డీకేను కలిశారు.
రేవంత్ నుంచి ప్రాణహాని..: పీసీసీ కార్యదర్శి విజయ్‌కుమార్
తెలుగు యూనివర్సిటీ/హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): రేవంత్ కాంగ్రెస్‌కు పట్టిన శని అని ఆ పార్టీ గద్వాల నేత, ఓయూ విద్యార్థి నాయకుడు డాక్టర్ కురువ విజయ్‌కుమార్ విమర్శించారు. అసెంబ్లీ సీట్లను రేవంత్ అమ్ముతున్నాడని ఆరోపిస్తూ సోమవారం హైదరాబాద్ గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద విజయ్‌కుమార్ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్.. నేడు సీటుకు నోటు అంటూ దోచుకుంటున్నారని మండిపడ్డారు.
65 సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గద్వాల టికెట్‌ను 10 కోట్లు, ఐదెకరాలు అమ్ముకున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని.. కాంగ్రెస్ కోసం దశాబ్దాలుగా పని చేసిన వారిని పట్టించుకోకుండా ప్యారాచూట్ నేతలకు టికెట్లు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రకటించిన మొదటి లిస్టును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ అనుచరులు తనను చంపుతామని బెదిరిస్తూ రెక్కీ నిర్వహిస్తున్నారని, వెంటనే పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. రేవంత్ అక్రమాలపై ఎన్నికల కమిషన్, ఈడీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.