Telangana | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖలో భారీ ఎత్తున కారుణ్య నియామకాలు ( Copassinate Appointment ) చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కారుణ్య నియామకా ల కోసం ఏకంగా 1,266 పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వీరికి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను సూపర్ న్యూమరరీ కింద జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ పోస్టులను భర్తీ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. జిల్లాలవారీగా జాబితాను విడుదల చేసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 117, హైదరాబాద్‌లో 73, సిద్దిపేటలో 64, నాగర్ కర్నూల్లో 59, జగిత్యాల, హనుమకొండలో 58 పోస్టుల చొప్పున ఉన్నాయి.
వీటితోపాటు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో కొత్తగా 33 పోస్టులను మంజూ రు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసిం ది. ఇందులో 28 పోస్టులను డీపీహెచ్ కార్యాలయానికి కేటాయించగా, హైదరాబాద్ జిల్లా పరిధిలో మరో ఐదు డీఎంహెచ్‌వో పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక డీఎంహెచ్‌వో ఉండగా, కొత్తగా వచ్చిన పోస్టులతో ఈ సంఖ్య ఆరుకు పెరుగుతుంది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డీపీహెచ్ పరిధిలో 33 పోస్టులను మంజూరు చేయడంతోపాటు కారుణ్య నియామకాల కోసం 1,266 పోస్టులను అప్‌గ్రేడ్ చేశామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. కొత్తగా మంజూరు చేసిన పోస్టులతో రాష్ట్రంలో వైద్యసేవలు మరింత మెరుగుపడుతాయని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంపై పర్యవేక్షణ, వ్యాధుల నివారణ, నియంత్రణ, చికిత్స ప్రక్రియలు మెరుగుపడి, అన్ని స్థాయిల్లో మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు.
అడిషనల్ డైరెక్టర్ (అడ్మిన్) – 1
జాయింట్ డైరెక్టర్ (అడ్మిన్) – 1
డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) – 1
అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్- స్టేట్ క్యాడర్) – 3
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్టేట్ క్యాడర్) – 4
ఆఫీస్ సూపరింటెండెంట్ – 6
సీనియర్ అసిస్టెంట్ – 12
డీఎంహెచ్‌వో – 5