నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 31 : అకాల వర్షం రైతన్న కొంపముంచింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జిల్లాల్లో కురిసిన వర్షానికి మక్క, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన మక్క, వరి నేలకొరుగగా.. మామిడి కాయలు రాలిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకు పోగా, రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబోసిన మక్కలు తడిసి ముద్దయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. మక్క, వరి, మామిడితోపాటు నువ్వులు, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, సిర్పూర్ టీ, బెజ్జూర్ మండలాల్లో చేతికి అంది వచ్చే దశలో ఉన్న మక్క నేలకొరిగింది. మంచిర్యాల జిల్లా నెన్నెల, వేమనపల్లి, భీమారం, జైపూర్, జన్నారం, దండేపల్లి మండలాల్లో మామిడి పూత రాలింది. పలు ప్రాంతాల్లో మక్కజొన్న పంట దెబ్బతిన్నది. కన్నెపల్లి, భీమిని మండలాల్లో పసుపు, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కారణంగా పంట నష్టం జరిగింది. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 14 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎడపల్లి, నవీపేట్, వేల్పూర్, ఏర్గట్ల, రెంజల్, ఆలూర్, నందిపేట్, భీమ్‌గల్, డిచ్పల్లి, ఆర్మూర్, మాక్లూర్, కమ్మర్పల్లి, జక్రాన్‌పల్లి తదితర మండలాల్లోని 76 గ్రామాల్లో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. 2,559 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
బలమైన గాలుల కారణంగా చేతికొచ్చిన వరిపైరు పూర్తిగా నేలవాలింది. గింజలు రాలిపోయాయి. టార్పాలిన్లు ఈదురుగాలులకు ఎగిరిపోవడంతో కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయ్యింది. నిజామాబాద్ మార్కెట్లో విక్రయానికి తీసుకొచ్చిన పసుపు రాశులు తడిసిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన వర్షానికి మక్కజొన్న, వరి పంట, కల్లాలో ఆరబెట్టిన మిర్చి తడిసిపోయాయి. చిట్యాల మండలం నవాబుపేట, కైలాపూర్, గుంటూర్పల్లి, జూకల్ శివార్లలో, మహదేవపూర్ మండల కేంద్రంతోపాటు అంబట్పల్లి, కాళేశ్వరం, సూరారం పరిసర గ్రామాల్లో వరి, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.
జనగామలోని వ్యవసాయ మార్కెట్ కొత్త కాటన్ యార్డులో రైతులు ఆరబోసుకున్న మక్కజొన్నలు తడిసిముద్దయ్యాయి. భారీ గాలులు, ఉరుములతో మోస్తరుగా పడిన వర్షం చేతికొచ్చిన వరిపంట, మామిడి తోటలతో నష్టంచేకూర్చింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మార్కెట్ యార్డులోని, కల్లాల్లోని మక్కలు తడిసి ముద్దయ్యాయి. పెనుగాలులకు మామిడి కాయలు నేలరాలాయి. మార్కెట్ యార్డులోని, బస్తాల్లో నింపిన మక్కలు సైతం తడిసిపోయాయి. బీఆర్ఎస్ నాయకులు వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మా ఊరిలో ఎకరన్నరలో మక్క సాగు చేసిన. పంట వేసినప్పటి నుంచి వన్యప్రాణుల బెడద నుంచి కాపాడుకుంటూ వచ్చిన. 15 రోజుల్లో పంట చేతికొస్తుందనగా అకాల వర్షం దెబ్బతీసింది. పంట మొత్తం నాశనమైంది. వేలాది రూపాయలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆదుకోవాలి.
-భారతారపు రాజన్న, కొండాపూర్, దండేపల్లి, మంచిర్యాల