హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): భూతాపం, వాతావరణ మార్పులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఏకంగా మనిషి మనుగడకే సవాల్ విసురుతున్నాయి. అయినా, సగటు మనిషి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ప్రజల్లో చైతన్యం నింపడంలో ఆయా దేశాలూ ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా వాతావరణం మనిషి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నది. ‘వాతావరణ మార్పులు, భవిష్యత్తు విపత్తులు’ తదితర అంశాలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే నిర్వహించింది. జూలై 22 నుంచి ఆగస్టు 5 మధ్య 34 దేశాల్లో జరిపిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 23,507 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. భారత్లో భవిష్యత్తులో తలెత్తే వాతావరణ మార్పులపై ఎక్కువ మంది ఆందోళన వ్యక్తం చేశారు. భారత్తో పాటు మెక్సికో, హంగేరీ, టర్కీ, కొలంబియా, స్పెయిన్, ఇటలీ, చిలీ, ఫ్రాన్స్ దేశాల్లో వచ్చే పదేండ్లలో వాతావరణంలో కీలక మార్పుల రానున్నట్టు సర్వేలో తేలింది.
మనిషి జీవన విధానమే కారణం
భూమి, అడవులు, సహజ వనరులు, నీరు, వాతావరణం అన్నీ 19వ శతాబ్దం ముందు వరకు సవ్యంగా, స్వచ్ఛంగానే ఉన్నాయి. 150 ఏండ్ల క్రితం వరకు ఉష్ణోగ్రతలు స్థిరంగానే ఉండేవి. పారిశ్రామికీకరణ, అడవుల విధ్వంసం, అపరిమితమైన గనుల తవ్వకాలు, శిలాజ ఇంధనాల వాడకం, పట్టణీకరణ, ఎడారీకరణ, రసాయన సేద్యం, ప్లాస్టిక్ వినియోగం.. ఇవన్నీ పెరిగిన తర్వాతే పర్యావరణంలో విపరీత మార్పులు సంభవించాయి. బొగ్గు, ఇంధనం, సహజ వాయువు వినియోగం పెరిగి తద్వారా వచ్చే కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో అధికంగా కలిసిపోయి భూమి వేడెకుతున్నది. ప్రస్తుతం ప్రపంచం ఎదురొంటున్న ఎన్నో సమస్యలకు ప్రత్యక్ష, పరోక్ష కారణం భూతాపమే అనేది పర్యావరణవేత్తల హెచ్చరిక. నేడు పర్యావరణ, జల, ఆహార, ఆరోగ్య, ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, ఉద్యోగ- ఉపాధి భద్రత పెను ప్రమాదంలో పడటానికి మనిషి జీవన విధానమే ప్రధాన కారణం. ఇకనైనా వాతావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి సామాజిక బాధ్యతగా మారడం అవశ్యం.
మహిళల్లో రుతు సమస్యలు
సుందర్బన్లో దారుణ పరిస్థితులు
బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతంపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా సముద్ర మట్టం పెరగటంతో ఆ ప్రాంతంలోని జలాల్లో లవణాలు భారీగా పెరిగాయి. ఈ ఆకస్మిక మార్పు ఇక్కడి మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నది. వారిలో తీవ్రమైన రుతుక్రమ సమస్యలకు కారణమవుతున్నది. ఈ ప్రాంతంలో పురుషులు పనికోసం వలస వెళ్లటంతో, మహిళలు చెరువులు, నదుల్లో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. వీరు నడుము లోతు ఉప్పునీళ్లలో గంటలకొద్దీ నిలబడాల్సిన పరిస్థితి. నీటిలోని లవణీయత శాతంతో వీరిలో రుతుక్రమం, మూత్రనాళ, ఇతర ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయని గోరస్బోస్ గ్రామ్ బికాశ్ కేంద్ర స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నిహార్ రంజస్ రాప్తాస్ తెలిపారు.
సర్వేలోని కీలక అంశాలు