Cotton | ఆదిలాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దిగుబడులు వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో రైతులు పత్తిని ఇండ్లల్లోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో తెల్లబంగారం సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. 2022లో 3,83,251 ఎకరాలు, 2023లో 4,12,436 ఎకరాలు, ఈ వానకాలంలో 4,33,547 ఎకరాల్లో పత్తి సాగైంది. ఏటా జూన్ మొదటివారంలో రైతులు పత్తి విత్తనాలు వేస్తారు. జనవరి వరకు దిగుబడులు పూర్తి అవుతుండగా.. అక్టోబర్ రెండో వారంలో పంటను ఏరడం ప్రారంభిస్తారు. జూన్ మొదటి వారంలో వేసిన పత్తి దిగుబడులు చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాలేదు. అధికారులు పది రోజుల కిందట సీసీఐ, ప్రైవేటు వ్యాపారులు, టాన్స్పోర్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినా కొనుగోళ్లు ప్రారంభించే తేదీని నిర్ణయించలేదు. ఈ ఏడాది ఎకరాకు పది క్వింటాళ్ల వరకు పంట చేతికొచ్చే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.7,521 మద్దతు ధర ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 32 లక్షల క్వింటాళ్ల పంట విక్రయానికి వస్తుందని అంచనా వేసిన అధికారులు రైతులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో రెండు, బోథ్, సోనాల, నేరడిగొండ, పొచ్చెర, ఇంద్రవెల్లి, నార్నూర్, ఇచ్చోడ, గాదిగూడ, గుడిహత్నూర్, సిరికొండ, జైనథ్, బేలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో రైతులు పంటను ఇండ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులతోపాటు మహారాష్ట్రకు చెందిన దళారులు రైతుల అవకాశాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసే ప్రమాదం ఉన్నది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 ఉండగా.. దళారులు క్వింటాల్‌కు రూ.7 వేల వరకు చెల్లిస్తారు. దీంతో రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. కొనుగోలు చేసిన దళారులు డబ్బులను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. డబ్బులు ఇస్తారో ఎగకొడుతారో తెలియదు. పత్తి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లు ప్రారంభించక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రైతుబంధు, అందరికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు అవస్థలు పడుతుండగా.. పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాక చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. పత్తి తీసిన కూలీలకు డబ్బులు ఇవ్వడానికి అప్పు చేయాల్సి వస్తున్నది. మార్కెట్ యార్డుల్లో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభంకాక పోవడంతో రైతులు మహారాష్ట్ర దళారులకు పంటను విక్రయించే పరిస్థితులు ఉన్నాయి.
వారం రోజుల నుంచి పత్తి తీయడం ప్రారంభమైంది. నేను మూడు ఎకరాల్లో పంట సాగు చేయగా 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అమ్మడానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకుపోదామంటే కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఇంట్లో నిల్వ చేశా. అధికారులు వెంటనే సీసీఐ కేంద్రాలను ప్రారంభించి పంటను సేకరించాలి. లేకపోతే దళారులకు అమ్మి నష్టపోయే ప్రమాదం ఉన్నది.