Ex Minister Vijaya Ramarao | మాజీ సీబీఐ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు (85) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం.. జుబ్లీహిల్స్‌లోని అపొలో దవాఖానలో చేర్చారు. ఆయన చికిత్స పొందుతూ రాత్రి ఏడు గంటల సమయంలో తుది శ్వాస విడిచారని డాక్టర్లు ప్రకటించారు.
వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో జన్మించిన విజయరామారావు ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది. అటుపై ఉన్నత విద్యా కోర్సుల కోసం మద్రాస్‌కు వెళ్లి.. మద్రాస్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి కాగానే 1958లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. ఆ తర్వాత సివిల్స్‌కు ఎంపికయ్యారు. 1959 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో సేవలందించారు. 1959 అక్టోబర్‌లో చిత్తూరు ఏఎస్పీగా విజయరామారావు బాధ్యతలు స్వీకరించారు.
1984లో నాటి అధికార తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నాటికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు. తర్వాత సీబీఐ డైరెక్టర్‌గా పని చేశారు. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు, ముంబై బాంబు పేలుళ్లు తదితర కేసులు దర్యాప్తు చేశారు. సర్వీసులో ఉన్నప్పుడే ఎల్ఎల్బీ పూర్తి చేశారు. పోలీసుశాఖ నుంచి రిటైర్ అయ్యాక `పోలీస్ మాన్యువల్` రాశారు. అధికార వికేంద్రీకరణను ఎక్కువగా నమ్మిన వ్యక్తి విజయరామారావు.
టీడీపీ అధినేత చంద్రబాబు స్ఫూర్తితో 1999 ఎన్నికల నాటికి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో అప్పటి సీఎల్పీ నేత పీ జనార్ధన రెడ్డిపై ఖైరతాబాద్ స్థానం నుంచి గెలుపొందారు. అలా ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటిసారే రాష్ట్ర క్యాబినెట్లో రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా పని చేశారు. కానీ, 2004 ఎన్నికల్లో పీ జనార్ధన రెడ్డి, 2009 ఎన్నికల్లో దానం నాగేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు.