హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. భూసేకరణ పూర్తికాకపోవడం, ఇతర అనుమతులు రాకపోవడం వల్ల ఇప్పుడే పనులు చేపడితే మధ్యలో ఆగిపోవడం ఖాయమనే ఉద్దేశంతో ట్రిపుల్ఆర్కు కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలేదని సమాచారం. ముందూ వెనుకా ఆలోచించకుండా అనుమతులు జారీచేయడంవల్ల దేశవ్యాప్తంగా సుమారు 700 హైవే ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయని, వాటిలో భూసేకరణ సమస్యల వల్ల 35% ప్రాజెక్టులు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి రైల్వే శాఖ నుంచి అనుమతులు రాకపోవడంవల్ల మరో 30% ప్రాజెక్టులు నిలిచిపోయినట్టు గుర్తించారు. పర్యావరణ అనుమతుల జాప్యం, కాంట్రాక్టర్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల మిగిలిన ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నట్టు కనుగొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంపై ఇటీవల ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా చేపట్టిన రహదారి ప్రాజెక్టుల్లో 697 ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. వాటిలో 70 ప్రాజెక్టులు మహారాష్ట్రలో, 40 కర్ణాటకలో, 21 ప్రాజెక్టులు హర్యానాలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 35% భూసేకరణ సమస్యతో జాప్యమైనట్టు ఉగుర్తించారు.
2014-24 మధ్య కాలంలో ఏటా సగటున 11 వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టగా.. వాటిలో 9.6 వేల కి.మీ.ల చొప్పున రహదారుల నిర్మాణం పూర్తయింది. దీన్ని బట్టి ఏటా దాదాపు 1.5 వేల కి.మీ. రహదారుల నిర్మాణంలో జాప్యం (బ్యాక్లాగ్) జరిగినట్టు స్పష్టమవుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8,581 కి.మీ. రహదారుల నిర్మాణం చేపట్టగా.. 12,349 కి.మీ. పూర్తిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 4,544 కి.మీ. రహదారుల నిర్మాణం చేపట్టగా.. 7,709 కి.మీ. మేర పూర్తిచేశారు. గత పదేండ్లలో నిలిచిన, జాప్యం జరిగిన ప్రాజెక్టులు గత రెండేండ్ల నుంచి ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో నిర్మాణ ప్రాజెక్టులకన్నా పూర్తవుతున్నవి ఎక్కువ ఉన్నట్టు తెలుస్తున్నది.
రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతులు రాకముందే టెండర్లు ఖరారుచేసి పనులు అప్పగించడం, అనంతరం ఆ పనులు నిలిచిపోవడంవల్ల వ్యయం భారీగా పెరుగుతున్నదని, పనులు సకాలంలో పూర్తికావడంలేదని పార్లమెంటరీ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో భూసేకరణ పూర్తిచేసి, అన్ని రకాల అనుమతులు, ఆర్థిక వనరులు సమకూర్చున్న తర్వాతే టెండర్లు ఖరారుచేసి పనులు అప్పగించాలని, దీనివల్ల జాప్యాన్ని నివారించవచ్చని సిఫారసు చేసింది. ఇందుకోసం అవసరమైతే ప్రస్తుత విధానంలో మార్పులు చేయాలని సూచించింది. అందువల్లే ట్రిపుల్ఆర్కు అనుమతులు నిలిచిపోయినట్టు తెలిసింది. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో 90 శాతానికిపైగా భూసేకరణ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గతంలో అవార్డ్ పాస్ అయిన రైతులు కూడా ఇప్పుడు నష్టపరిహారం పెంచాలని కోర్టులను, ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో భూసేకరణ వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. ట్రిపుల్‌ఆర్‌లో ఆరు చోట్ల రైల్వే క్రాసింగ్‌లు ఉండటంతో అక్కడ ఆర్వోబీలు లేదా ఆర్‌యూబీలను నిర్మించేందుకు రైల్వేశాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.