హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. 15న సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీని సందర్శిస్తారు. 16న నిజాం లా కాలేజీలో నిర్వహించే రోజ్‌గార్ మేళాను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కన్హాశాంతి వనంలో నిర్వహించే దక్షిణాది రాష్ర్టాల స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొంటారు.
టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును విద్యాశాఖ అమలుచేయనున్నది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఈ హాజరు కోసం డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్‌ను వినియోగిస్తున్నది. ఈ యాప్‌లో స్టాఫ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇచ్చారు. పాఠశాల జీపీఎస్ లొకేషన్ ఆధారంగా హాజరును నమోదుచేయనున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ టీచర్ హాజరు నమోదు చేసేందుకు యత్నించగా.. ‘మీరు పాఠశాల ప్రాంగణం బయట ఉన్నారు. ఇలా పాఠశాల ప్రాంగణానికి ఔట్‌సైడ్‌లో ఉండి హాజరు నమోదు చేయలేరు. మీరు స్కూల్ లొకేషన్‌కు 10వేల మీటర్ల దూరంలో ఉన్నారు.’ అని చూపించడంతో సదరు టీచర్ అవాక్కయ్యారు. జనగామ జిల్లాకు చెందిన మరో టీచర్ హాజరు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తే 773 మీటర్ల దూరంలో ఉన్నట్టు చూపించింది. ఇది వరకు విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదుచేయగా, ఇక నుంచి టీచర్లకు విస్తరించనున్నారు.