హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా కాకుండా, తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాపాలన దినోత్సవం పేరిట నిర్వహించే కార్యక్రమానికి తాను రాలేనని స్పష్టంచేశారు. సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి కేంద్ర మంత్రుల ను ఆహ్వానించిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. ముఖ్యమంత్రికి ఆదివారం లేఖ రాశారు. సెప్టెంబర్ 17ను పవిత్రమైన, స్ఫూర్తిదాయకమైన రోజు గా కిషన్‌రెడ్డి అభివర్ణించారు. వేలాది మంది త్యాగాల ఫలితమైన విమోచన దినోత్సవం పేరును మార్చి చరిత్రలో ఏమీ జరగలేదన్నట్టుగా వక్రీకరించడం తగదని పేర్కొన్నారు. ఘనమైన తెలంగాణ చరిత్రను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో తాను భాగస్వామిని కాలేనని తెలిపారు.
ఓవైసీకి భయపడే.. : మహేశ్వర్‌రెడ్డి
ఎంఐఎం ఒవైసీలకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించడంలేదని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఇతర పేర్లతో నిర్వహించడం తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను విస్మరించడమేనని ఆదివారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.