చిక్కడపల్లి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇండ్లు కూల్చితే తెలంగాణ రణరంగంగా మారుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి అన్నారు. పేదలు ఆక్రోశంతో ప్రభుత్వంపై తిరగబడితే ఏ పోలీసులూ అడ్డుకోలేరని హెచ్చరించారు. మూసీ బాధితులకు అండగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో శుక్రవారం బీజేపీ మహాధర్నా నిర్వహించింది.
ధర్నాలో పాల్గొన్న కిషన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వం వైఖరి విడాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ్కుమార్ మాట్లాడుతూ మూసీ పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలన్నీ కలుషితమైపోయాయిని, ఇందుకు కారణం 40, 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటూ పేదల ఇండ్లు కూల్చడం దారుణమని మండిపడ్డారు.
ఎంపీ ఈటల మాట్లాడుతూ సీఎం పేదలెవరూ ఆక్రమణలకు పాల్పడలేదని పేర్కొన్నారు. ధర్నాలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్. ప్రభాకర్ పాల్గొన్నారు.