హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వైద్య విద్యనందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ‘ఎక్స్’లో ఫైరయ్యారు. తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత నెలకొందని మండిపడ్డారు.
రాజాసింగ్ యూటర్న్!
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వ నిర్ణయాలను సైతం తప్పుబడుతూ వస్తున్న రాజాసింగ్ సడెన్‌గా మనసు మార్చుకున్నారు. ఇటీవల రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో ఆయనపై సస్పెన్షన్ వేటు తప్పదని కాషాయ దళంలో చర్చ నడిచింది. ఇలాంటి రాజాసింగ్.. ఇప్పుడు ఏకంగా కలిసి పనిచేద్దామంటూ మంగళవారం కిషన్‌రెడ్డిని కోరడం చర్చనీయాంశంగా మారింది. ‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనేది నా లక్ష్యం. కిషన్‌రెడ్డి కొంత సమయం కేటాయిస్తే పార్టీ సహచరులతో కలిసి సమస్యలను వివరిస్తా. కిషన్‌రెడ్డి ఎప్పుడు, ఎక్కడ సమావేశం నిర్వహించినా రావడానికి మేము సిద్ధం. వ్యక్తిగత విభేదాలను విడిచిపెట్టి ఐక్యంగా పనిచేద్దాం’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. రాజాసింగ్‌లా తాను సీనియర్ నాయకుడిని కానని, సామాన్య కార్యకర్తనని అంటూ కిషన్‌రెడ్డి తన శైలికి భిన్నంగా చురకలు అంటించారు.