హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ఒకవైపు రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తుండగా… మరోవైపు ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులే అవన్నీ అబద్ధాలంటూ… తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తున్నారు. గతంలో అనేకసార్లు తెలంగాణ పథకాలను కేంద్ర మంత్రులు ఆకాశానికెత్తారు. తాజాగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్రసింగ్ హైదరాబాద్ అభివృద్ధిని వేనోళ్ల పొగిడారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్‌గా హైదరాబాద్ ఫార్మా సిటీ నిలుస్తున్నదని కితాబిచ్చారు. హెల్త్, వెల్త్, ఫార్మా రంగాలకు హైదరాబాద్ వరల్డ్ క్యాపిటల్‌గా మారిందని కొనియాడారు. హైదరాబాద్ కేంద్రంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ప్రపంచ నలుమూలలకు చేరి మరో ఘనతను సాధించిన సంగతిని గుర్తు చేశారు. శాస్త్ర, సాంకేతిక, వైద్య, లైఫ్ సైన్సెస్ రంగాలకు వేదికగా ఉన్న హైదరాబాద్ భారత్‌కు కీలకమైన కేంద్రంగా మారిందని చెప్పారు. ఫార్మాసిటీతో దేశీయ ఫార్మారంగం సరికొత్త మైలురాళ్లను అధిరోహిస్తున్నదని పేర్కొన్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో వారంపాటు నిర్వహిస్తున్న వన్ వీక్-వన్ ల్యాబ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఐఐసీటీ తీర్చిదిద్దిన మానవ వనరులు దేశంలోని ఫార్మా, బయోటెక్ పరిశ్రమలకు వరంలాంటివని స్పష్టం చేశారు. ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులను కట్టడి చేసే జనరిక్ మందుల తయారీ ఐఐసీటీ సాంకేతికతతోనే సాధ్యమైందని చెప్పారు. గ్యాస్ట్రిక్ అల్సర్ల నివారణ, గర్భస్రావం, ప్రసవాలను ప్రేరేపించే ప్రోస్టాగ్లాండిన్ ఆధారిత ఔషధం, మిసోప్రోస్టోల్ను ప్రాసెస్ చేయడం వంటి ఆవిషరణలకు హైదరాబాద్ కేంద్రంగా ఐఐసీటీయే రూపమిచ్చిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 37 సీఎస్ఐఆర్ ల్యాబ్‌లన్నీ విభిన్న రంగాలపై పరిశోధనలు చేస్తున్నాయని గుర్తు చేశారు. ఎన్నో విశిష్టతలు కలిగిన అలాంటి ల్యాబ్‌లలో ఐఐసీటీకి 80 ఏండ్ల చరిత్ర ఉన్నదని చెప్పారు. కెమికల్, బయోటెక్నాలజీ నూతన ఆవిష్కరణలు, సరికొత్త టెక్నాలజీలకు వేదికగా మారుతున్న ఐఐసీటీలో వన్ వీక్-వన్ ల్యాబ్ కార్యక్రమం యంగ్ రిసెర్చ్, విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఎన్నో ప్రయోగాలు, ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన సీఎస్ఐఆర్ ఇప్పుడు ది ఇన్నోవేషన్ ఇంజిన్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందుతున్నదని చెప్పారు. 4,500 మందికి పైగా శాస్త్రవేత్తల సమూహంతో, గ్లోబల్ సెంటర్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్‌గా సీఎస్ఐఆర్ ఉద్భవిస్తున్నదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఐఐసీటీ సాంకేతిక పరిజ్ఞానంతోనే..
గుజరాత్లో ప్రారంభించిన హైడ్రాజీన్ హైడ్రేట్ ప్లాంట్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఐఐసీటీ డెవలప్ చేసిందన్నారు. వాయురహిత గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ టెక్నాలజీ ఆధారిత ప్లాంట్‌ను బోయిన్పల్లి మారెట్యార్డ్లో ఏర్పాటు చేసిన సంగతిని ప్రధాని మన్‌కీ బాత్ లో ప్రస్తావించారని తెలిపారు. ఎయిడ్స్ జనరిక్ మందులకు ఐఐసీటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిందని చెప్పారు. యాంటీ-వైరల్ డ్రగ్స్, కొవిడ్ -19 నియంత్రణకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీలో ఐఐసీటీ ప్రధానపాత్ర పోషించిందని తెలిపారు. శాస్త్ర, సాంకేతికతను సామాన్యుడి చెంతకు చేర్చడంలో ముఖ్య భూమికగా మారిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.